ఏ పార్టీ నుండి రాష్ట్రపతి పదవికి ప్రతిపాదనను అంగీకరించబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వస్తే తనను “రాష్ట్రపతిని చేస్తారు” అని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ తప్పుడు ప్రచారం చేశాయని, తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయాన్ని సమీక్షించిన తర్వాత మాయవతి ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను కాన్షీరామ్‌కు శిష్యురాలు అని, ఆయనలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, ఏ పదవీ ఆశించనని తేల్చి చెప్పారు.
“మా పార్టీ అంతం అవుతుందని తెలిసినప్పుడు నేను ఎలా రాష్ట్రపతి పదవిని ఎలా అంగీకరించగలను. కాబట్టి మా పార్టీ, ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా, నేను ఎటువంటి ప్రతిపాదనను అంగీకరించనని ప్రతి BSP ఆఫీస్ బేరర్‌కు స్పష్టం చేయాలనుకుంటున్నాను. కార్యకర్తలు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు” అని మాయావతి అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుండగా, అంతకంటే ముందే ఆ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాట్లాడుతూ తన జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి వెచ్చిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.