Modi vs Kharge: మోడీ Vs ఖర్గే

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రస్తావించారు. ఆయన పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు.

డా. ప్రసాదమూర్తి

Modi vs Kharge: సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షాలు సర్వసన్నద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ప్రతిపక్ష కూటమి, INDIA రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాన్ని, సీట్ షేరింగ్ సమస్యని, వివిధ అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge) పేరును ప్రస్తావించారు. ఆయన పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు. ఇలా ఒక పేరు ప్రతిపక్ష కూటమికి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం ఇదే తొలిసారి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలనలో పడిపోయింది. మిగిలిన మిత్రపక్షాల పట్ల తాము వ్యవహరించాల్సిన తీరు, ఎన్నికల సర్దుబాటులో విషయంలో అనుసరించాల్సిన పద్ధతి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, పాటించాల్సిన నిబద్ధత మొదలైన విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆత్మ మథనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే పేరును ప్రతిపక్షాల్లో ముఖ్యమైన నాయకులే ప్రధాని అభ్యర్థిగా సూచించడం రానున్న ఎన్నికల రణరంగంలో అటూ ఇటూ ప్రధాని అభ్యర్థులు ఎవరు ఉంటారనేది ఇంచుమించుగా అందరికీ ఒక అవగాహన ఏర్పడింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఇప్పటికే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ తమ పార్టీ తరఫున మెయిన్ ఫేస్ గా ప్రధాని నరేంద్ర మోడీ( PM Modi) ని పెట్టడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా “ మోడీ దిల్ మే ఎంపీ హై.. ఎంపీ కా దిల్ మే మోడీ హై” అంటూ బిజెపి నాయకులు నినాదాలు చేశారు. అంతేకాదు రాజస్థాన్, ఛత్తీస్గడ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా మోడీ ఒక్కరి పేరునే బిజెపికి ఎన్నికల ప్రధాన అస్త్రంగా ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా, అవన్నీ మోడీ మహత్వంతోనే, మోడీ చరిష్మా తోనే జరుగుతున్నాయని బిజెపి నాయకులు ముక్తకంఠంతో చెబుతుంటారు. మహిళా బిల్లు విషయంలో గానీ, కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో గాని, కాశ్మీర్ కు చెందిన 370 అధికరణం రద్దు విషయంలో గానీ.. ఇలా ఏ కీలకమైన అంశమైనా అదంతా మోడీ పుణ్యమే అని బిజెపి నాయకులు ప్రచారం చేస్తుంటారు.

“ మోడీ హై తో సబ్ కుచ్ హై..”అంటే మోడీ ఉంటే సమస్తం అని, సమస్తంలోనూ మోడీ ఉన్నారని మోడీని అఖండమైన అజేయమైన అభేద్యమైన వజ్ర తుల్యమైన మహా నాయకుడిగా బిజెపి కార్యకర్తల నుండి అగ్ర నాయకుల వరకు అందరూ అభివర్ణిస్తున్నారు. మోడీని ఈ దేశం కోసం జన్మనెత్తిన అవతార పురుషుడిగా కీర్తిస్తున్నారు. జనవరిలో రామ మందిరం ప్రారంభోత్సవ సంరంభం ఇక ఎలా ఉంటుందో, ఆ సందర్భంగా అటు శ్రీరాముడికి ఇటు మోడీకి మధ్య ఎంతటి సామీప్యాన్ని తెస్తూ బిజెపి నాయకులు మోడీ నామ జపం చేస్తారో ఊహించుకోవచ్చు. మోడీని ఏకంగా దైవ సమానంగా కీర్తించడం జరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో అధికార బిజెపికి అగ్రభాగంలో నిలబడి ఎన్నికల రణరంగంలో ముందుకు దూసుకుపోతున్న మోడీని ఎదుర్కోవడానికి అంత శక్తివంతమైన, అంత బలోపేతమైన, అంత దీటైన నాయకుడు ప్రధాని అభ్యర్థిగా ప్రతిపక్షాలకు అవసరం ఉంటుంది.

ప్రతిపక్షాలు ఇప్పుడు మోడీని ఢీకొనే అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ముందుకు పెడుతున్నారు. ఇలా ప్రస్తావించడంలో వారు ఖర్గే దేశానికి కాబోయే తొలి దళిత ప్రధాని అంటూ వ్యాఖ్యానించడం కూడా మొదలుపెట్టారు. బిజెపి ఇప్పటికే సామాజిక న్యాయం, హిందుత్వం రెండూ జమిలిగా రాజకీయాలు సాగిస్తోంది. సోషల్ ఇంజనీరింగ్ లో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ సామాజిక న్యాయం కార్డును ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా వినియోగిస్తోంది. ఒకవేళ ఖర్గే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉంటే బీసీ వర్సెస్ ఎస్సీ ప్రధాని అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కేంద్రీకృతం అవుతుంది. ఇదంతా సరేగాని రాహుల్ గాంధీ మాటేమిటి? ప్రతిపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రధాని కావాలన్న కలలు కంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాటేమిటి? ఖర్గే విషయంలో అందరూ ఏకతాటి మీదకు వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతిపక్షాలు ఒక ఉమ్మడి అభ్యర్థిని ప్రధానిగా పోటీలో నిలపాలని ఆలోచన సరైనదే. ఆ ఆలోచనపై ప్రతిపక్షాలు ఎంత ఏకీభవంతో సమైక్యంగా నిలబడతాయో చూడాల్సి ఉంది.

Also Read: Milk Drinking Tips : ఆ సమయంలో పాలు తాగుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..