CAA 2024 : ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి.. అమిత్ షా ఇంకా ఏమన్నారంటే..

CAA 2024 : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

Published By: HashtagU Telugu Desk
Amit Shah comments manipur women video

Amit Shah comments manipur women video

CAA 2024 : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలను లోక్‌సభ ఎన్నికలకు ముందు జారీ చేసిన తర్వాత అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024’లో శనివారం మాట్లాడుతూ అమిత్‌షా ఈవిషయాన్ని ప్రకటించారు.  ‘‘మా ముస్లిం సోదరులను అందరూ తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారు. సీఏఏ(CAA 2024) అనేది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించింది మాత్రమే. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు’’ అని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. ‘‘యూనిఫాం సివిల్ కోడ్‌ అనేది రాజ్యాంగపరమైన ఎజెండా. దీనిపై దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహా పలువురు ప్రముఖులు సంతకం చేశారు’’ అని తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా యూసీసీ అమలు సాధ్యపడటం లేదు. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు ఒక సామాజిక మార్పు. ఇప్పుడు దీనిపై అంతటా చర్చ మొదలైంది. మనది లౌకిక దేశం. ఇందులో మతం ఆధారిత సివిల్ కోడ్‌లు అమల్లో ఉండకూడదు’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలో రామమందిరాన్ని నిర్మించాలని దేశ ప్రజలు 550 ఏళ్లుగా కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు ఆ ఆకాంక్షను మా ప్రభుత్వం నెరవేర్చింది. బుజ్జగింపు రాజకీయాలు, శాంతిభద్రతలను సాకులుగా చూపించి గత ప్రభుత్వాలు రామమందిర నిర్మాణాన్ని అడ్డుకున్నాయి’’ అని ఆయన చెప్పారు.  “జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని మేం రద్దు చేశాం. కాబట్టి దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్‌డీఏకు 400 సీట్లను ఇచ్చి ఆశీర్వదిస్తారని మేం నమ్ముతున్నాం’’ అని అమిత్ షా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కుటుంబ నియంత్రణపై నమ్మకం ఉంది.. కానీ.. 

‘‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్ అక్కర్లేదు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మళ్లీ ప్రతిపక్ష బెంచ్‌లలో కూర్చోవాల్సిందే’’ అని స్పష్టం చేశారు.  ‘‘జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ), శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరుతాయా ?’’ అని అమిత్ షాను ప్రశ్నించగా.. ‘‘కుటుంబ నియంత్రణపై నమ్మకం ఉంది. రాజకీయాల్లో నియంత్రణపై నమ్మకం లేదు’’ అని ఆయన సెటైర్ వేశారు. మరిన్ని పార్టీలు తప్పక ఎన్డీఏలో చేరుతాయన్నారు.  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర గురించి ప్రశ్నించగా.. ‘‘ 1947లో దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణం. నెహ్రూ-గాంధీ వంశానికి ఇలాంటి పాదయాత్రలు చేసే హక్కు లేదు’’ అని అమిత్‌షా  చెప్పారు.

Also Read : Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?

  Last Updated: 10 Feb 2024, 01:39 PM IST