Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. బిహార్‌లో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే.. అధికారంలోకి వచ్చిన గంటలోగా మద్య నిషేధాన్ని ఎత్తేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఈ హామీ ఇచ్చేందుకు తాము గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నామని పీకే తెలిపారు. మద్య నిషేధాన్ని ఎత్తేసే విషయంలో రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. మద్య నిషేధం అమలవుతుండటం వల్ల బిహార్ ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని అధికారులు, లిక్కర్ మాఫియా అక్రమంగా మద్యం విక్రయించి వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన(Prashant Kishor) ఆరోపించారు. అక్టోబరు 2న జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. వాటికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను ప్రశాంత్ కిషోర్ మీడియాకు వివరిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
Also Read :Asaduddin Owaisi : తాజ్‌మహల్ నిర్వహణే చాతకావడం లేదు.. ‘వక్ఫ్’ ఆస్తులూ కావాలా.. ఏఎస్ఐపై అసదుద్దీన్ భగ్గు
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వల్ల బిహార్‌కు కలిగే లాభమేం లేదని పీకే కామెంట్ చేశారు. వారిద్దరూ తమ తమ రాజకీయ భవితను చూసుకుంటున్నారే తప్ప బిహారీల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. తేజస్వి యాదవ్ ఇప్పటికైనా యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతుండటం మంచి పరిణామమన్నారు.‘‘నితీశ్, తేజస్విల పనితీరును బిహార్ ప్రజలు 30 ఏళ్ల పాటు చూశారు. ఓటర్లకు అన్నీ బాగా తెలుసు. ఆ ఇద్దరి పీడ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించాలని నేను ఓటర్లను కోరుతున్నాను’’ అని పీకే కామెంట్ చేశారు. కాగా, ప్రశాంత్ కిశోర్ ఎక్కడా బీజేపీపై విమర్శలు చేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా బీజేపీక ఆయన చేరువయ్యారు. బిహార్‌లోనూ పీకే అదే తరహాలో బీజేపీకి మిత్రపక్షంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.