Heat Wave: ఉత్తరభారతంలో దంచికొడుతున్న ఎండలు..!!

ఉత్తరభారతంలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి. గ్లోబర్ వార్మింగ్ కారణంగానే...మన దేశంలో మే నెల రాకముందే తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 09:28 AM IST

ఉత్తరభారతంలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి. గ్లోబర్ వార్మింగ్ కారణంగానే…మన దేశంలో మే నెల రాకముందే తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకంటే…ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎల్లో అలర్ట్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఎండ తీవ్రత స్థాయిలో అర్థం చేసుకోవచ్చు.

వాతావరణంలో మార్పుల వల్ల…ప్రపంచంలోని మిగతా దేశాలకంటే…భారత్ మరిన్ని సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం…రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని IMD పేర్కొంది.

గతకొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే… 1981, 2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈవిధంగా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి పేర్కొంది. అందుకే ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది ప్రభుత్వం. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం ఆధారంగా చూసినట్లయితే..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైయ్యిందని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2020 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నది స్పష్టం అవుతోంది. ఇది భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధకులు వెల్లడించారు.

మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.