Restaurant Charges: అదనంగా సర్వీసు ఛార్జీ ఎందుకు? హోటల్స్, రెస్టారెంట్స్ లకు కోర్టు ప్రశ్న!!

హోటల్స్, రెస్టారెంట్స్ లో కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీ ప్రత్యేకంగా వసూలు చేయాలా? వద్దా?

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 09:15 AM IST

హోటల్స్, రెస్టారెంట్స్ లో కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీ ప్రత్యేకంగా వసూలు చేయాలా? వద్దా? అనే దానిపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో ఉంది.కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరాదంటూ నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) జారీ చేసిన మార్గదర్శకాలపై ఢిల్లీ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం నెల క్రితం స్టే విధించింది. తాజాగా మంగళవారం (ఆగస్టు 16) రోజున ఈ కేసుకు సంబంధించిన వాదనలను ఢిల్లీ హైకోర్టు విన్నది.

హోటల్స్, రెస్టారెంట్స్ వాటి కస్టమర్ల నుంచి వంటకాల రేట్లకు అదనంగా సర్వీస్ ఛార్జీని వసూలు చేయాల్సిన అవసరం ఏముంది? అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అదనంగా సర్వీస్ ఛార్జీని బిల్లులో ప్రస్తావిస్తే.. అది ప్రభుత్వం విధించే పన్ను అయి ఉంటుందనే భావనకు కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుందని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఈ కేసుకు సంబంధించిన వాదనలను ఆగస్టు 18కి వాయిదా వేసింది.

వాదనల్లో కీలక విషయాలు..

ఈ విచారణ సందర్భంగా రెస్టారెంట్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సర్వీస్ చార్జీ అనేది ప్రభుత్వం కోసం కాదని, రెస్టారెంట్ లోని ఉద్యోగుల కోసమని తెలిపారు. దీనికి స్పందించిన న్యాయమూర్తుల ధర్మాసనం.. సర్వీస్ చార్జీ అనేది కేవలం రెస్టారెంట్ లోని ఉద్యోగులకు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు. రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్స్ పైనా దాని ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల పై అంతగా రెస్టారెంట్లకు ఆలోచన ఉంటే.. వాళ్ల వేతనాలు పెంచాలని ధర్మాసనం హితవు పలికింది. “మీరు అదనంగా డబ్బును వసూలు చేయాలని భావిస్తే.. మీ రెస్టారెంట్లలో ఉండే ఐటమ్స్ రేట్లను పెంచుకోండి. అంతేతప్ప సర్వీస్ చార్జీ పేరుతో అడ్డదారిలో వసూళ్లు చేసే ప్రయత్నాలు సరికాదు” అని కోర్టు నిర్దేశించింది.