కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు (Dhiraj Sahu ) పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు (It Rides) నిర్వహించగా.. కళ్లుచెదిరే నోట్ల గుట్టలు ధీరజ్ సాహు స్థావరాల్లో బయటపడ్డాయి. నాలుగు రోజులైనా లెక్కింపు పూర్తికాకపోవడం గమనార్హం. ఇప్పటివరకు రూ.300కోట్ల నల్లధనాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. దాదాపు 100మంది అధికారులు 40 మెషీన్లతో లెక్కిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వెంట, వెంటనే ఒడిశాలోని ప్రభుత్వ బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)స్పందించారు.
దేశ చరిత్రలో జరిగిన ఐటీ దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన బయట పడటం ఇదే తొలిసారని, ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. డబ్బులు లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయి.. తప్పితే లెక్కించడం పూర్తికావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ రకంగా ఉందో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహు. రాహుల్ భారత్ జోడో యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది సాహునే. ఐటీ దాడులపై కేంద్రాన్ని రాహుల్ విమర్శిస్తారు. ఇప్పుడు ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఎందుకు మాట్లాడట్లేదు..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌కు సాహు వంటి అవినీతిపరులు ఎంత మంది సన్నిహితులుగా ఉన్నారో? ఆ డబ్బు ఎవరిదో ఆయనే చెప్పాలి. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ప్రతి రోజు కాంగ్రెస్ కుంభకోణాలే కనిపించాయి. 2జీ, బొగ్గు వంటి అనేక కుంభకోణాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుందన్నారు.
ఇక ధీరజ్ విషయానికి వస్తే..ధీరజ్ సాహు ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన కుటుంబం చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ తో అనుబంధం కలిగి ఉంది. 2010 నుంచి జార్ఖండ్ నుంచి ధీరజ్ రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన కుటుంబం పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. తాజాగా ఐటీ శాఖ దాడులు నిర్వహించిన డిస్టిలర్ గ్రూప్, దాని అనుబంధ సంస్థల్లోనూ ధీరజ్ కుటుంబ సభ్యులకు లింక్ ఉందని తేలింది. బౌద్ డిస్టిలరీస్‌లో గ్రూప్ కంపెనీ అయిన బల్దేవ్ సాహు ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కాంగ్రెస్ ఎంపీతో లింక్ చేయబడింది. ఈ విధంగా 300 కోట్ల నల్లధనం స్కామ్‌లో ధీరజ్ పేరు వెలుగులోకి వచ్చింది.
Read Also : Komatireddy Venkat Reddy : సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తాం – మంత్రి కోమటిరెడ్డి