Modi : 9 రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్, బీజేపీ లాజిక్ ఎందుకు పనిచేయలేదు? మోదీది.. అఖండ విజయం కాదా?

10 ఏళ్ల కిందట కాంగ్రెస్ కూడా ఇదే గెలుపు పొగరుతో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పొగరు కాదు కదా.. వగరు కూడా లేదు.

  • Written By:
  • Publish Date - March 11, 2022 / 12:12 PM IST

10 ఏళ్ల కిందట కాంగ్రెస్ కూడా ఇదే గెలుపు పొగరుతో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పొగరు కాదు కదా.. వగరు కూడా లేదు. చెప్పాలంటే పార్టీ కూడా అలాగే పతనం అవుతూ వచ్చింది. అలాగని అదే హిస్టరీ ఇప్పుడున్న పార్టీకి రిపీట్ అవుతుందని కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ నాయకులే. అందరూ మాస్టర్ బ్లాస్టర్ లే. మరి అంతటి అఖండులు.. కాంగ్రెస్ పవర్ లో ఉన్న రాష్ట్రాల్లో తప్ప ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు గెలవలేకపోతున్నారు?

కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కిందట 13 రాష్ట్రాల్లో పవర్ లో ఉండేది. కానీ ఇప్పుడు రెండంటే రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆ మూల నుంచి ఈ మూల వరకు హస్తానికి దిక్కేది? ఇదే పరిస్థితిని క్యాష్ చేసుకుంది బీజేపీ. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో డైరెక్ట్ గా గెలిచినా.. మిగిలిన రాష్ట్రాల్లో కమలానికి పవర్ ఎలా వచ్చిందో కాషాయనాథులకు తెలియంది కాదు. అప్పట్లో కాంగ్రెస్ చేసిందే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తోంది. కథ, కథనం ఒకటే.. పాత్రలే మారుతున్నాయి. మరి కాంగ్రెస్ ఉనికి లేని చోట మోదీ మ్యాజిక్ ఎందుకు పనిచేయడం లేదబ్బా!

హస్తిన మొదలు కేరళ వరకు బీజేపీ ప్రభావమేది? ఢిల్లీ, పంజాబ్ లో అయితే కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు కదా. ఇక మమత కోటలో బీజేపీ అన్ని జిమ్మిక్కులూ చేసినా మోదీ మ్యాజిక్ పనిచేయలేదు. సరే బీహార్ సంగతి చూద్దామంటే.. నితీశ్ లేకుండా పాలించే సీన్ కనిపించడం లేదు. తెలంగాణలో పులిలా కనిపిస్తున్నా.. అది గ్రాండ్రింపులకే పరిమితమా కాదా అన్నది వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.

ఏపీకి చేసిన అన్యాయానికి దాని దరిదాపుల్లోకి కూడా బీజేపీని రానివ్వడం లేదు. దీనికి అక్కడి వైసీపీ హవా కూడా ఓ కారణం అని చెప్పచ్చు. తమిళనాడులో అన్నాడీఎంకే వెనకుండి ప్రభుత్వాన్ని నడిపించినా మరోసారి పవర్ లోకి తీసుకురాలేకపోయింది. కేరళలో ఎంటరైనా సరే.. సీట్లు గెలుచుకోలేకపోయింది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ని ఢీకొట్టే సీన్ లేదు. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే.. మోదీ ప్రధానిమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాతే ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు అన్నీ జరిగాయి. మోదీయే స్వయంగా ప్రచారం కూడా చేశారు. మరి కమల వికాసం ఏది?

మోదీ మ్యాజిక్, బీజేపీ లాజిక్ ఆ 9 రాష్ట్రాల్లో పనిచేయలేదు అన్నది కళ్లముందు కనపడుతున్న సత్యం. అంటే కాంగ్రెస్ ఎక్కడ ఫెయిలవుతోందో.. అక్కడ బీజేపీ గెలుస్తోంది. అంతే కాని.. కమలనాథులు సొంతంగా ఏ రాష్ట్రాన్ని గెలుచుకోలేకపోతున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బీజేపీ ప్రభంజనాలు లేవు. కాకపోతే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మోదీకి తిరుగులేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా అలాంటి చరిష్మా ఉన్న మరో నేత ఇప్పటికైతే లేరు కదా!