Republic Day 2026 : 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! రిపబ్లిక్ డే ను కేవలం పండుగలా జరుపుకోవడమే కాకుండా, ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను ప్రతి భారతీయుడు తెలుసుకోవడం ఎంతో అవసరం. మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, అప్పట్లో మనకంటూ సొంత చట్టాలు లేవు. అప్పటివరకు బ్రిటిష్ వారు రూపొందించిన ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935’ ప్రకారమే పాలన సాగేది. ఒక స్వతంత్ర దేశానికి సొంత నియమావళి ఉండాలని భావించిన మన నాయకులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. సుమారు 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు కఠిన శ్రమకోర్చి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ రచన పూర్తయి, ఆమోదం పొందినప్పటికీ, దానికి ఒక ప్రత్యేక చరిత్రను జోడించాలని జనవరి 26 వరకు నిరీక్షించారు.
Republic Day History
జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు?
రాజ్యాంగం సిద్ధమైనా రెండు నెలలు ఆగి మరీ జనవరి 26నే అమలు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. 1930 జనవరి 26న లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా “పూర్ణ స్వరాజ్” (సంపూర్ణ స్వాతంత్య్రం) నినాదాన్ని ఇచ్చింది. ఆ రోజును తొలి స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకున్నారు. ఆ చారిత్రక ఘట్టానికి గౌరవార్థం, మన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు. నాటితో భారత్ బ్రిటిష్ డొమినియన్ హోదా నుండి విముక్తి పొంది, ఒక స్వతంత్ర “రిపబ్లిక్” (గణతంత్ర) దేశంగా అవతరించింది. అంటే, దేశాధినేత వారసత్వంగా కాకుండా, ప్రజల ద్వారా ఎన్నికయ్యే వ్యవస్థ ఏర్పడింది.
గణతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదు, మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులను స్మరించుకోవడం. ఈ 77 ఏళ్ల ప్రయాణంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తిగా ఎదిగింది. రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే, దేశాభివృద్ధిలో పౌరులుగా మన ప్రాథమిక విధులను నిర్వర్తించడం మన బాధ్యత. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మన దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పడమే ఈ ఉత్సవాల అసలు ఉద్దేశ్యం.
