Gujarat Cable Bridge: గుజరాత్ ఘటనకు బాధ్యులు ఎవరు ?

Gujarat Cable Bridge: మోర్బీ దుర్ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. వినోదం కోసం విహారానికి వెళ్లినవారు.. జలసమాధి అయిపోయారు. ఇంతకూ తప్పెక్కడ జరిగింది.. ? ఈ ఘోరకలికి బాధ్యులెవరు..? వంతెనపైకి ఒకేసారి అంతమందిని ఎలా అనుమతించారు..?

  • Written By:
  • Updated On - November 1, 2022 / 12:12 PM IST

Gujarat Cable Bridge: మోర్బీ దుర్ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. వినోదం కోసం విహారానికి వెళ్లినవారు.. జలసమాధి అయిపోయారు. ఇంతకూ తప్పెక్కడ జరిగింది.. ? ఈ ఘోరకలికి బాధ్యులెవరు..? వంతెనపైకి ఒకేసారి అంతమందిని ఎలా అనుమతించారు..? బ్రిడ్డిని రిపేర్ చేసిన సంస్థ ఏం చెబుతోంది..? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టాల్సి ఉంది…

ఫిట్‌నెస్‌ లేని బ్రిడ్జి.. వందల మంది సందర్శకులు.. కంట్రోల్ చేయాల్సిన నిర్వాహకులు పట్టించుకోలేదు.. అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని చెక్‌ చేసి.. అప్రూవల్ ఇవ్వాల్సిన విభాగం నిర్లక్ష్యం వహించింది.. ఫలితం వంద మందికి పైగా ప్రాణాలు జలసమాధి అయిపోయాయి. మృతుల్లో 47మంది పిల్లలే. ఇందులో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. మోర్బీలో కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ తప్పిదాలే ప్రమాదానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. 100 మందిని మోయగల సామర్థ్యం ఉన్న వంతెనపైకి ఒకేసారి 400-500 మందిని ఎలా అనుమతించారన్నదే అసలు ప్రశ్న. టికెట్ డబ్బుల కోసం కక్కుర్తి పడి వందల ప్రాణాలు బలి తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆకతాయిల చేష్టలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు యువకులు వంతెనను విపరీతంగా ఊపడంతోపాటు ఎగిరెగిరి దూకడం, కేబుళ్లను కాళ్లతో తన్నడం చేశారు. సీసీటీవీల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కేబుల్‌ బ్రిడ్జిని రిపేర్‌ చేసి నాలుగు రోజల క్రితమే రీఓపెన్ చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓరేవా గ్రూపు ఈ మరమ్మతు పనులు చేపట్టింది. ఇందుకోసం 2 కోట్లు ఖర్చు చేసినట్టు గొప్పగా చెప్పింది. కానీ నాలుగు రోజులు తిరక్కుండానే వంతెన కూప్పకూలింది. ఫిట్‌నెస్‌ టెస్ట్ పూర్తికాకుండా.. షెడ్యూల్ కంటే ముందే వంతెనను రీఓపెన్ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నిర్వహణ సంస్థపై నేరపూరిత హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. బ్రిడ్జి కాంట్రాక్టర్‌, మేనేజర్‌, సెక్యూరిటీ, టికెట్లు జారీచేసే వ్యక్తి సహా 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోర్బీలో తీగల వంతెన కూలిన ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ పరిశీలించనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతం ప్రధాని మోదీ గుజరాత్‌లోనే ఉన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. మోర్బీలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి బ్రిటిష్ కాలం నాటిది. 140 ఏళ్ల నాటి ఈ తీగల వంతెన ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 134 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు త్రివిధ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్ ప్రభుత్వం.. దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టంచేసింది.