Gyanesh Kumar : జ్ఞానేశ్ కుమార్.. భారత ఎన్నికల సంఘం నూతన సారథి ఈయనే. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఈయనను ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఎంపిక చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం జరిగిన తొలి నియామకం ఇదే. కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల(ఫిబ్రవరి) 19న విచారణ జరగనుంది. అందుకే సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీ ఎంపికపై నిర్ణయాన్ని వాయిదావేయాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ సూచన చేశారని సమాచారం.
Also Read :Aircraft Crashed : ల్యాండ్ కాగానే విమానం బోల్తా.. 18 మందికి గాయాలు
ఈరోజుతో ముగియనున్న పదవీకాలం
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పదవీకాలం ఈరోజు(మంగళవారం)తో ముగుస్తుంది. అందుకే సోమవారం సాయంత్రం నూతన సీఈసీని ఎంపిక చేశారు. రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను(Gyanesh Kumar) సీఈసీ పదవికి ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ సేవలు అందించారు. జ్ఞానేశ్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని నియమించారు. సుఖ్‌బీర్ సింగ్ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్నారు.
Also Read :TTD : ముంబైలో పద్మావతి అమ్మవారి ఆలయం కోసం భూమి కేటాయింపునకు టీటీడీ అభ్యర్థన
జ్ఞానేశ్ ఎవరు ?
- జ్ఞానేశ్ కుమార్ వయసు 61 ఏళ్లు.
- ఆయన 1964 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించారు.
- జ్ఞానేశ్ ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేశారు.
- ఇక్ఫాయ్ సంస్థలో బిజినెస్ ఫైనాన్స్ కోర్సు చేశారు.
- అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్ ఎకానమిక్స్ కోర్సు చేశారు.
- జ్ఞానేశ్ కుమార్ కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
- 2019లో రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంశాఖలో అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శి (కశ్మీర్ డివిజన్) హోదాలో సేవలు అందించారు.
- తదుపరిగా కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు.
- గత ఏడాది మార్చిలో ఆయన ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు.
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జ్ఞానేశ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
- జ్ఞానేశ్ సీఈసీగా 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు.