China Border : చైనాతో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం అంశంపై ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన దాదాపు 75 శాతం మేర సమసిపోయిందని ఆయన వెల్లడించారు. చర్చల ద్వారా ఈమేరకు పరిష్కారాన్ని సాధించగలిగామని, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించామని తెలిపారు. ‘‘సరిహద్దుల్లో పెట్రోలింగ్‌తో ముడిపడిన అంశానికి ఇంకా పరిష్కారం దొరకాల్సి ఉంది. దానికి పరిష్కారం దొరికిన తర్వాత సరిహద్దు పాయింట్లలో ఇరుదేశాలు భద్రతా బలగాల సంఖ్యను తగ్గించే అంశంపై చర్చ జరగనుంది’’ అని జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ఏషియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (China Border) ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Kamala Harris : ట్రంప్‌ను దాటేసిన కమలా హ్యారిస్.. ఆసియన్ అమెరికన్ల మద్దతు ఆమెకే
గతంలో కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న టైంలో చైనా దళాలు పెద్ద సంఖ్యలో భారత దళాలతో ఘర్షణకు దిగిన విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు. సరిహద్దుల విషయంలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఆనాడు చైనా ఆర్మీ ఉల్లంఘించిందని తెలిపారు. ‘‘ఆసియా ఖండం భవిష్యత్తు అనేది భారత్, చైనా సంబంధాల బలోపేతంపై ఆధారపడి ఉంది. ఈ అంశాన్ని గుర్తెరిగి ఇరుదేశాలు నడుచుకోవాలి’’ అని భారత విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచ సుస్థిరతలోనూ భారత్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
Also Read :Kamala Harris : అమెరికాలో కలకలం.. కమలా హ్యారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు
‘‘చైనాతో భారత్‌కు ఘర్షణలు కొత్తేం కాదు. గతంలో ఇలాంటి అనుభవాలను భారత్ ఎదుర్కొంది. ఈక్రమంలోనే కొవిడ్ మహమ్మారి మొదలైన టైంలో చైనా పెద్దసంఖ్యలో సైనికులనుు మా సరిహద్దుల వద్దకు పంపింది. ఈ ఘర్షణలో ఇరుదేశాల సైనికులూ చనిపోయారు. ఆనాడు చైనా చేసిన చేష్టల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి’’ అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.