By: డా. ప్రసాదమూర్తి
Real Intention behind the Name Change of India : రోజుకో కొత్త ఊసు గాల్లోకి ఊది, దేశానికి ఊపిరాడకుండా చేయడమే ఏలిన వారి ఏకైక వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ప్రపంచ దేశాలు భారత్ లో జరుగుతున్న సమస్త విషయాలను చూస్తున్నాయి.. వింటున్నాయి. ఈ నెల 8 నుంచి G20 సమావేశాలు మనదేశంలో జరగనున్నాయి. దీనికి అమెరికా ఇంగ్లాండ్ రష్యా చైనా మొదలైన ప్రముఖ దేశాల అగ్రనేతలు హాజరుకానున్నారు. ఆతిథ్యం ఇస్తున్న భారత్ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. మరో పక్క దేశంలో అనేకచోట్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక సమస్య సద్దుమణగక ముందే, మరోచోట మరో సమస్య తలెత్తుతుంది. సమస్యను పరిష్కరించడం కంటే సమస్యను నానబెట్టి నానబెట్టి కాలగర్భంలో దానంతట అదే కలిసిపోయేటట్టు చేయడమే పాలకులు పెట్టుకున్న లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా భారత్ లో భాగమైన మరో పేరు ఇండియా (India) ను తొలగించి ఇక భారత్, భారత్ గానే ఉంటుందని ఇండియా పేరు ఉండదని కొత్త దుమారం రేగడానికి సరికొత్త అవకాశాలను కేంద్రంలోని పెద్దలు కల్పించారు.
రోజుకో కొత్త అంశాన్ని చర్చకు పెట్టి దానిమీద దేశమంతా దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కేంద్రంలోని పాలకులకు అనివార్యమైన అస్త్రంగా మారినట్టు కనిపిస్తోంది. అసలే విదేశాల నాయకులు ఇక్కడకు వస్తున్నారు. వారి నోట ఇండియా అనే మాటే వస్తుంది. మరి ఈ సందర్భంలో సరిగ్గా ఇప్పుడే ఎందుకు దేశం పేరు మార్చే మాట ప్రచారంలో పెట్టారు? దాన్ని ప్రతిపక్షాలు ఒక రకంగా, పాలకపక్షాలు మరొక రకంగా, విశ్లేషకులు ఇంకొకరకంగా ఎవరికి తోచినట్టు వారు చెప్తున్నారు. జి20 సమావేశాలకు విచ్చేసే విదేశీ ప్రముఖుల విందుకు రాష్ట్రపతి భవనం నుంచి ఆహ్వానం వెళ్ళింది. అందులో ఎప్పుడూ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా (The President of India ) అని ఉండేది. ఇప్పుడు ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (The President of Bharat ) అని ఉంది. ఇదే ఈ తాజా దుమారం చెలరేగడానికి కారణమైంది. అలాగే త్వరలో ప్రధాని ఇండోనేషియా పర్యటన నోట్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ (The Prime Minister of Bharat) అని విడుదల చేశారు.
ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రతిపక్షాలు మొదటిసారి పాట్నాలో కలిసినప్పుడు ఆహా వీరంతా కలిసినప్పుడు చూడొచ్చులే! అని ఎద్దేవా చేశారు. రెండోసారి బెంగళూరులో కలిసినప్పుడు వీరిలో వీళ్లే కొట్టుకు చస్తారు, వీళ్ళలో ఐక్యత ఎండమావిలో నీరు లాంటిదని విమర్శలు గుప్పించారు. అసలు కలవకముందే ముక్కముక్కలవుతారని ముసి ముసి నవ్వులు కూడా నవ్వారు. అయితే ముంబైలో ప్రతిపక్షాల కలయిక దేశానికి చాలా గట్టి సంకేతాలే ఇచ్చింది. అదీగాక కూటమి పేరు ఇండియా (INDIA) అనేది పాలక పక్షానికి మింగుడు పడని విషయంగా మారింది. అందుకే ప్రతిపక్షాల ముంబై సమావేశం తర్వాత బిజెపి వారు రోజుకో కొత్త అంశాన్ని చర్చకు పెడుతూ వస్తున్నారు. ముందు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అన్నారు. తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో దీనిపై ఒక కమిటీ వేశామన్నారు. దేశమంతా ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంపై చర్చలు చేస్తుంటే, ఇప్పుడు దేశం పేరే మారుస్తామని, చెప్పకుండానే రాష్ట్రపతి ఆహ్వాన పత్రం ద్వారా చెప్పించారు. అంతేకాదు, అసలు ఇండియా అనేది ఇంగ్లీషువాడు మన దేశాన్ని తిట్టిన బూతు మాట అని సాక్షాత్తు ఒక అధికారి ఎంపీ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇదంతా కావాలని చేస్తున్నారా ? దేశంలో ఏకమవుతున్న ప్రతిపక్షాలను దారి మళ్ళించడానికి, తాము పరిష్కరించలేని సమస్యల పట్ల దేశం దృష్టి పెట్టకుండా చేయడానికి ఇలా రకరకాల అంశాలను దేశం ముందు చర్చకు పెడుతున్నారా? అనే విమర్శలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇదంతా ప్రజల దృష్టి మళ్లించడానికే అని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అంటే, దేశం పేరు మార్చే హక్కు వీళ్ళకు లేదని శరద్ పవార్ ఎదురుదాడికి దిగితే, పేరు మార్చడం దేశద్రోహం అని కేజ్రీవాల్ ఆగ్రహం ప్రదర్శిస్తే, ఇంత హడావిడిగా ఇప్పుడు ఈ గొడవేంటని మమత విమర్శించింది. మరోపక్క బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్ పి వారు మాత్రం జై భారత్.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా మొత్తం దేశమంతా ఒక గందరగోళ చర్చ వైపు కొట్టుకుపోయింది. బహుశా బిజెపి మనసులో ఉన్న కోరిక కూడా ఇదే కావచ్చు. పైకి మాత్రం దేశం పేరు మార్చుతామని తాము ఎక్కడా చెప్పలేదని ఇదంతా చెత్త చర్చ అని కొందరు బిజెపి నాయకులు కొట్టి పాడేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఇండియా, ది భారత్, ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ (India, The Bharat, is Union of States) అని భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 లో చెప్పింది. రెండింటిలో ఏ పేరైనా వాడుకోవచ్చని రాజ్యాంగమే ఆ వెసులుబాటు కల్పించింది. మరి ఈ తాజా వివాదం ఎంతవరకు సబబు? మతలబు ఏదైనా రాజ్యాంగ సవరణతో ముడిపడిన ఇలాంటి విషయాలు, పార్లమెంటు సమావేశమై అందరి సమక్షంలో చర్చకు పెట్టాలి తప్ప, గాలిలో ఉదంతాలు వ్యాప్తి చేసి, అసలు దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలు గాలిలోకి వదిలేయడం సమంజసం కాదని పెద్దలు చెబుతున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏం చెబుతారో చూడాలి.