Site icon HashtagU Telugu

Jamili Elections : జమిలి ఎన్నికలు అంటే ఏమిటి..? ఈ ఎన్నికలపై విశ్లేషకులు ఏమంటున్నారు..?

Jamili Elections

Jamili Elections

జమిలి ఎన్నికల బిల్లు(Jamili Elections)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం (Union Cabinet approve) తెలిపింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు జమిలి ఎన్నికల బిల్లు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లును త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అసలు జమిలి ఎన్నికలు అంటే ఏమిటి..? అని అంత అరా తీయడం మొదలుపెట్టారు.

జమిలి ఎన్నికలు (Jamili Elections) అంటే ఏంటి అంటే…

జమిలి ఎన్నికలు అనగా దేశం మొత్తం ఒకే సారి పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం. దీనిని ఇంగ్లీషులో “One Nation, One Election” అని పిలుస్తారు. జమిలి ఎన్నికల ముఖ్య ఉద్దేశ్యం, ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం మరియు పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం.

జమిలి ఎన్నికల (Jamili Elections) నేపథ్యం :

భారతదేశంలో మొదటి సారిగా 1952లో పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1967 తర్వాత కేంద్రంలో మరియు రాష్ట్రాల్లో ప్రభుత్వం పడిపోవడం వల్ల ఎన్నికలు విడివిడిగా జరుగుతూ వస్తున్నాయి. దీనివల్ల ఎన్నికల కోసం ఎక్కువ సమయం, వ్యయం కేటాయించాల్సి రావడం మొదలైంది. ఇది పాలనపై కూడా ప్రభావం చూపుతోంది.

జమిలి ఎన్నికల (Jamili Elections) వల్ల ప్రయోజనాలు :

జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల వ్యయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం ఎక్కువ సమయాన్ని, ఖర్చు చేయవలసి వస్తుంది. జమిలి ఎన్నికల వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదనంగా, అన్ని ప్రభుత్వాలు ఒకే సమయంలో ఏర్పాటు అవడం వల్ల పాలనా స్థిరత్వం కూడా సాధ్యం అవుతుంది.

జమిలి ఎన్నికల (Jamili Elections) సమస్యలు :

జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవ్వడం కోసం రాజ్యాంగ సవరణలు అవసరం. పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల పదవీకాలం తేడాలు ఉండటం వల్ల ఈ ఎన్నికల అమలు కష్టసాధ్యంగా మారుతుంది. అంతే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం ప్రాక్టికల్‌గా సమస్యాత్మకం అవుతుందని కొంతమంది అంటున్నారు.

జమిలి ఎన్నికల కోసం రాజకీయ పార్టీల మధ్య సమగ్ర చర్చ అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో జమిలి ఎన్నికలు ఒక మార్గదర్శకంగా మారవచ్చు కానీ, దానిని అమలు చేయడానికి దేశంలోని ప్రతీ మూలాంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ సమన్వయం జరిపినప్పుడు మాత్రమే ఇది సుసాధ్యం అవుతుంది.

జమిలి ఎన్నికల(Jamili Elections)పై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

జమిలి ఎన్నికల నిర్వహణతో సిబ్బంది వినియోగానికి ఖర్చు తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఏక కాలంలో ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అడ్డంకులు ఉండవని, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు లాజిస్టిక్ సమస్య అడ్డంకిగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈవీఎంలతో పాటు 100 శాతం వీవీప్యాట్స్ను అందుబాటులో ఉంచడం అతి పెద్ద సమస్య అని వారి వాదన. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు వస్తాయని అంటున్నారు.

జమిలి ఎన్నికల (Jamili Elections) అమలుకు చేయాల్సిన రాజ్యాంగ సవరణలు :

* లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించడం.

* ఎమర్జెన్సీ పరిస్థితుల సమయంలో సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరించడం.

* రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85 (2) (బి‌) సవరణ చేయాల్సి ఉంటుంది.

* రాష్ట్రాల అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు ఉండే ఆర్టికల్ 174 (2) (బి‌)ని సవరించాల్సిన అవసరం ఉంది.

* రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణ చేయాలి.

* ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాల్సి ఉంది.

Read Also : PMAY-U 2.0 : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనను నిర్వహించనున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్