Site icon HashtagU Telugu

What happened in Rajasthan? : రాజస్థాన్ లో ఏం జరిగింది?

What Happened In Rajasthan..

What Happened In Rajasthan..

By: డా. ప్రసాదమూర్తి

What happened in Rajasthan? : రాజస్థాన్లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ వరసగా రెండోసారి ప్రభుత్వంలోకి రాలేదు. ఇది ఆ రాష్ట్రంలో గతానుగతంగా వస్తున్న రాజకీయ సంప్రదాయం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అధికారంలో ఉన్న పార్టీ ఎంత మంచి పని చేసినా, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ధోరణి రాజస్థాన్ (Rajasthan) ప్రజలలో ఎక్కువగా ఉండి ఉండవచ్చు. గత కారణాలు ఎలా ఉన్నప్పటికీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పట్ల అత్యధిక ప్రజాదరణ ఉన్నట్టు సర్వేల ద్వారా వ్యక్తం అయింది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చాలా ప్రజాదరణ పొందాయి. అన్నిటికంటే ఎక్కువగా చిరంజీవి హెల్త్ స్కీం విస్తృతమైన ప్రజల మద్దతు పొందింది. ఈసారి రాజస్థాన్ (Rajasthan) ప్రజలు సంప్రదాయాన్ని మార్చి అశోక్ గెహ్లోట్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పట్టం కడతారని చాలామంది భావించారు.

ఇండియా టుడే లాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కూడా పోస్ట్ పోల్ సర్వేలో రాజస్థాన్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యథతో అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ ఇక్కడ కూడా సీన్ రివర్స్ అయింది. రాజస్థాన్ (Rajasthan) ఓటర్లు సాంప్రదాయ పరంపరకే ఓటు వేసినట్టు అర్థమవుతుంది. అయితే ఇది కేవలం పైకి చూస్తే అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడిప్పుడే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రచారం సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు, పనితీరుకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ హిందుత్వ కార్డును ప్లే చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నం సఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అదే ప్రయత్నం బిజెపిని గెలిపించినట్టుగా ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.

We’re Now on WhatsApp. Click to Join.

రాజస్థాన్లో ఎన్నికలు జరిగిన 199 స్థానాలలో బిజెపి అనూహ్యంగా 115 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 70, బీఎస్పీకి రెండు, ఇతరులకు 12 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తాము పనిచేసిన విధానానికి ప్రజలు పట్టం కడతారని అతి ధీమాతో ఉన్నారు. అందుకే వారు అక్కడ సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. బిఎస్పీతో పొత్తు పెట్టుకోలేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది. ఒకపక్క ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియాకుటమిగా ఏర్పడి బిజెపితో పోరాడతామని చెబుతూ, ఈ ఎన్నికల్లో ఆ ఐక్యతను ఎందుకు చూపించలేదో ఇప్పుడు వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ పడవ మునిగిపోయాక పడవలో ఎన్ని కన్నాలు ఉన్నాయో తెలుసుకున్నా ఫలితం ఏముంది? ఇవన్నీ ఒక ఎత్తుగా బిజెపి రాజస్థాన్ రాష్ట్రాన్ని కాషాయీకరించాలని సాగించిన కృషి,పన్నిన వ్యూహం బాగా ఫలించినట్టుగా ఉంది.

రాజస్థాన్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వర్గానికి నొప్పి తగలకుండా వ్యవహరిస్తుందని, మెజారిటీ హిందువులకు ఆ ప్రభుత్వం హాని చేస్తుందని విపరీతమైన ప్రచారాన్ని బిజెపి చేసింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో నలుగురు హిందూ స్వాములను బరిలో నిలిపింది. బాల ముకుంద ఆచార్య హవా మహల్ నియోజకవర్గం నుంచి, మహంత్ ప్రతాప్ పూరి పోఖ్రాన్ నుంచి, ఓటా రామ్ దేవాసి శిరోహి నుంచి, మహంతి బాలక్ నాథ్ తిజారా నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.

మహంతి బాలక్ నాథ్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్ తో తన పోటీని ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గా అభివర్ణించారు. ఈ విషయం మీద కాంగ్రెస్, బిజెపి హిందూ పోలరైజేషన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని ఎంత గగ్గోలు పెట్టినా అది అంతగా వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఈసారి ఎన్నికలలో బిజెపి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీలో దింపలేదు. మొదటిసారి ఇలా జరిగింది. మోడీ, అమిత్ షా తమ ప్రచార సభలలో కాంగ్రెస్ పార్టీ మీద మతపరమైన దాడి సాగించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరిగిన మతకలహాల పట్ల, పెరిగిన ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రధాని అనేక సభల్లో తీవ్రంగా విరుచుబడ్డారు. రాజస్థాన్ ఎన్నికల్లో నిలుచున్న హిందూస్వాముల్లో ఇద్దరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాగా వేషధారణ చేసుకొని ప్రచారం సాగించారు.

బాలక్నాథ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజు నుంచి తనను తాను యోగి ఆదిత్యనాథ్ తో పోల్చుకొని మాట్లాడుతారు. ఆయన నిలబడ్డ తిజారా నియోజకవర్గంలో గతంలో ఒక్కసారే బిజెపి గెలిచింది. అక్కడ హిందువుల ఓట్లు 62 శాతం ఉంటాయి. ఈసారి 86 శాతానికి పైగా ఆ నియోజకవర్గంలో ఓట్లు పోలయ్యాయి. ఆదిత్యనాథ్ కూడా స్వయంగా ఆ నియోజకవర్గంలో బాలక్ నాథ్ కోసం ప్రచారం చేశారు. మొత్తానికి ఎన్నికల ఫలితాలు చూస్తే స్వామీజీలు నలుగురు విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. వీళ్ళు కేవలం వేషాన్ని బట్టి మాత్రమే మనం వారేంటో తెలుసుకోగలం. కానీ బిజెపి మొత్తం చాప కింద నీరులా హిందుత్వ కార్డును ఎన్నికల్లో ప్రయోగించడం వల్ల అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పనులు చేసినా ఫలితం దక్కలేదు. ప్రజలు పథకాల కంటే ఎక్కువ మతానికే ఓటు వేసినట్టుగా కనిపిస్తోంది.

Also Read:  Jagga Reddy: ప్రజాతీర్పును గౌరవిస్తా.. ఓటమిపై జగ్గారెడ్డి రియాక్షన్