Kejriwals Future Plan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చిత్తుగా ఓడిపోయింది. ఎంత వేగంగా ఢిల్లీ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఎదిగిందో.. అంతే దారుణంగా ఆప్ పతనమైంది. 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70కి ఏకంగా 62 గెల్చుకున్న ఆప్.. ఈసారి కేవలం 22 సీట్లకు పరిమితమైంది. ఆనాడు 5 సీట్లను గెల్చిన బీజేపీ.. ఈనాడు 48 సీట్లను కైవసం చేసుకుంది. ఇంత దారుణమైన పరాభవం తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారు ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :Tsunami : సముద్రంలో భారీ భూకంపం.. సునామీ సైరన్.. 20 దేశాలు అలర్ట్
టార్గెట్ ఢిల్లీవాసీ
2012 నవంబరు 26న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏర్పడింది. పార్టీ ఏర్పడిన కొత్తలో ఢిల్లీ ప్రజలు దాన్ని బాగా నమ్మారు. అరవింద్ కేజ్రీవాల్(Kejriwals Future Plan) ఆశయాలను గౌరవించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని ఆయన చెబితే విశ్వసించారు. దేశంలోనే విప్లవాత్మకంగా ఆప్ పనిచేస్తుందని చెబితే నిజమేనని భావించారు. ప్రజల ఆశీర్వాదం ఉండటం వల్లే నాటి నుంచి 2020 ఎన్నికల వరకు ఢిల్లీలో జరిగిన ప్రతీ ఎన్నికలో ఆప్‌ను విజయమే వరించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసినా టచ్ చేయలేనంత మెజారిటీ వచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు దారుణమైన ఫలితం వచ్చింది. ఢిల్లీ ప్రజలకు ఆప్ అగ్రనేతలు దూరమైన ప్రభావమే ఈ ఫలితం అని కేజ్రీవాల్‌కు బాగా తెలుసు. కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఓడిపోయారు.
అతిషికి కీలక బాధ్యతలు ?
గత ఐదేళ్లలో ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిందేం లేదు. అందుకే ఇకపై ఢిల్లీలో ప్రజలతో టచ్‌లోకి వెళ్లడంపై కేజ్రీవాల్ ఫోకస్ పెట్టనున్నారు. అవినీతి ఆరోపణలు రాజకీయపరమైనవే అని ప్రజలను నమ్మించి, సమస్యల పరిష్కారానికి పోరాడుతామని భరోసా కల్పించడంపై ఆయన శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. ఆప్ పార్టీలోనూ అంతర్గతంగా ప్రక్షాళన చేయడంపై కేజ్రీవాల్ ఫోకస్ పెడతారని భావిస్తున్నారు. ఈక్రమంలో ఢిల్లీకి సంబంధించిన కీలక బాధ్యతలను మాజీ సీఎం అతిషికి అప్పగించి, జాతీయ స్థాయిలో ఆప్ విస్తరణపై కేజ్రీవాల్ పనిచేస్తారని అంటున్నారు.
Also Read :MG Astor 2025: అత్యంత అధునాతన ఫీచర్లతో కొత్త కారు.. ధర ఎంతంటే?
పంజాబ్‌లో బలోపేతం.. ఎన్నో సవాళ్లు
ఇక ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్. అక్కడ మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి ఆప్ బలంగా ఉండేలా చేయడంపై కేజ్రీవాల్ శ్రద్ధ పెట్టనున్నారు. పంజాబ్ సీఎం, ఆప్ అగ్రనేత భగవంత్ మాన్ నేతృత్వంలో ఆ రాష్ట్రంలో ఆప్ ముందుకు సాగుతోంది. ఇకపై తీరిక ఉండే కేజ్రీవాల్.. పంజాబ్‌పై అతిగా శ్రద్ధ పెట్టే అవకాశం లేకపోలేదు. దీనివల్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒకింత అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే రాబోయే రెండేళ్లలో ఆప్‌లో అంతర్గత పరిణామాలు మారే ఛాన్స్ ఉంటుంది. భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు మొదలైతే.. దాన్ని ఆసరాగా చేసుకొని పంజాబ్‌లోని ఆప్ అగ్రనేతలు, ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపునకు లాగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని కేజ్రీవాల్ పావులు కదుపుతారా ? లేదా ? అనేది వేచిచూడాలి.
జాతీయ స్థాయిలో విస్తరణ
ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష అరవింద్ కేజ్రీవాల్‌కు ముందు నుంచే ఉంది. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, గోవాలలో కూడా ఆప్ క్యాడర్ ఉంది. ప్రత్యేకించి పలు ఉత్తరాది రాష్ట్రాలలో ఆప్‌ను బలోపేతం చేయడంపై తదుపరిగా కేజ్రీవాల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో కీలక నేతలను ఆప్‌లోకి ఆహ్వానించే మిషన్‌ను ఆయన మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. తద్వారా ఢిల్లీలో తమ పార్టీని ఓడించిన బీజేపీకి, రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీని పెంచే వ్యూహాన్ని కేజ్రీవాల్ అమలు చేసే అవకాశం స్పష్టంగా ఉంది.