Mamata Banerjee : వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా కీల‌క వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మద్దతు

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 08:34 AM IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని ప్రతిపాదించారు. కర్ణాటక‌లో కాంగ్రెస్ విజయం తరువాత దేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌పై ఇతర ప్రతిపక్ష పార్టీల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీకే మద్దతిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్ర‌క‌టించారు. బీజేపీపై పోరాటంలో ప్రతిపక్షాలు ఏకం కావాలని మమతా బెనర్జీ గతంలో పిలుపునిచ్చారు. అయితే బెంగాల్‌లో కాంగ్రెస్ తనను వ్యతిరేకిస్తూ బీజేపీకి సాయపడుతోందని పలుమార్లు విమర్శించారు. ఇక, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాలు మొదలైన తరువాత తొలిసారిగా మమత తన వైఖరి స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉందో అక్కడ ఆ పార్టీనే పోరాడనిద్దాం. మనం వారికి అండగా నిలుద్దాం. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, వారు కూడా ఇదే విధంగా ఇతర పార్టీలకు మద్దతివ్వాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట సీట్లు పంచుకునే విధానానికి ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా సూచించారు. ‘ఢిల్లీలో ఆప్, బీహార్‌లో ఆర్జేడీ-జేడీ-యూ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌లా… ఆయా ప్రాంతాల్లో బలాబలాలు ఉన్న పార్టీలు నేరుగా అక్కడ బీజేపీని ఎదుర్కోవాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని మ‌మ‌తాబెన‌ర్జీ తెలిపారు.తాము క‌ర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో వారు మాకు అదే విధంగా మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామ‌న్న‌ ఆమె వాదనలను ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి పూర్తిగా తోసిపుచ్చారు. ”కర్ణాటకలో బీజేపీకి ఓటు వేయకూడదనే నినాదాన్ని ఆమె లేవనెత్తార‌ని.. ఒక్క సారి అయినా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కర్ణాటక ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌పై త‌మ పోరాటం కొనసాగుతుందని అధిర్ రంజ‌న్‌ చౌదరి అన్నారు.