PM Modi – Israel : ప్రస్తుతం పాలస్తీనా, లెబనాన్ దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంది. ఆ దేశాలపై దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి యహూద్ ఓల్మెర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గొప్ప అంతర్జాతీయ నాయకుడు అని ఆయన కొనియాడారు. హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు తప్పకుండా మోడీ సహకరిస్తారని యహూద్ ఓల్మెర్ట్ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ తప్పకుండా సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా అడుగులు వేయాలని భారత ప్రధాని మోడీకి యహూద్ ఓల్మెర్ట్ (PM Modi – Israel) విజ్ఞప్తి చేశారు. భారత్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Omar Abdullah : ఒమర్ అబ్దుల్లా ‘డబుల్’ ధమాకా.. ముఫ్తీ కుమార్తె ఓటమి
యహూద్ ఓల్మెర్ట్ మాట్లాడుతూ.. ‘‘దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యను పరిష్కరించడానికి భారత్ మద్దతు తప్పకుండా అవసరం. ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు దేశాలుగా స్పష్టతతో విభజించే పరిష్కారం కోసం చర్చలు జరగాలి. ఇందుకు భారత్ బలమైన మద్దతు అవసరం’’ అని తెలిపారు. ‘‘భారత్ మాకు అత్యంత గౌరవనీయ దేశం. పాలస్తీనియన్లకు కూడా భారత్ చాలా ముఖ్యమైంది. మా రెండు దేశాల సమస్యను పరిష్కరించడంలో భారత్ తప్పకుండా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది’’ అని యహూద్ ఓల్మెర్ట్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు ఇది చాలా కష్టతరమైన, చాలా బాధాకరమైన, చాలా రక్తపాతమైన సంవత్సరం అని ఆయన అంగీకరించారు. ఇక రక్తపాతం ఆగడానికి సమయం ఆసన్నమైందన్నారు.
Also Read :Chewing Gum: చూయింగ్ గమ్ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
గాజాలో యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ త్వరలోనే నిర్ణయించుకుంటుందని తాను భావిస్తున్నట్లు యహూద్ ఓల్మెర్ట్ చెప్పారు. హమాస్ సైనిక శక్తిని విచ్ఛిన్నం చేశామన్నారు. ఇప్పటికీ హమాస్ చేతిలో 101 మంది ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ బందీలను విడిపించేందుకు అవసరమైతే యుద్ధాన్ని ఆపాల్సి ఉంటుందన్నారు.