Canada : కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను టార్గెట్ చేస్తున్న వేర్పాటువాద శక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్న రాజకీయ పార్టీలు, భారత్‌తో మిత్ర సంబంధాలను కొనసాగించలేవని ఆయన హెచ్చరించారు. కెనడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా, భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థానీ, జిహాదీ, యాంటీసెమిటిక్ శక్తుల నుండి దూరంగా ఉండాలని హార్పర్ సూచించారు. భారత్‌ను విభజించాలని లక్ష్యంగా పెట్టుకున్న శక్తులకు మద్దతు ఇవ్వడం కేవలం కెనడా అంతర్జాతీయ పరస్పర సంబంధాలను నాశనం చేయడమే కాకుండా, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: XChat: వాట్సాప్‌కు పోటీగా ఎక్స్ చాట్..ఫీచర్స్ ఇవే..!
ఇప్పటివరకు రాజకీయ పార్టీలు వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోవడంలో ఎందుకు ఆలస్యం చేశాయో తనకు అర్థం కావడం లేదని హార్పర్ వ్యాఖ్యానించారు. తాను ప్రధాని పదవిలో ఉన్న సమయంలో ఇటువంటి శక్తులనుంచి దూరంగా ఉండామని, ప్రస్తుత నాయకులు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. విశ్వాసం కలిగిన మిత్ర దేశాలుగా గుర్తింపు పొందిన భారత్ మరియు కెనడా మధ్య సంబంధాలు గత దశాబ్దంలో గణనీయంగా దిగజారాయి. ముఖ్యంగా 2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన తర్వాత సంబంధాలు మరింతగా బిగుసుకున్నాయి. అంతేగాక, భారత్ కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందంటూ కెనడియన్ ఇంటెలిజెన్స్ సంస్థలు చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య అంతరం పెరిగిపోయింది.
స్టీఫెన్ హార్పర్ 2006 నుంచి 2015 వరకు కెనడా ప్రధానిగా సేవలందించారు. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో, 1985లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం బాంబు దాడిపై విచారణ చేపట్టారు. ఆ దాడికి కారణమైన భద్రతా వైఫల్యాలపై రిటైర్డ్ జస్టిస్ జాన్ మేజర్ నేతృత్వంలోని కమిషన్ 2010లో నివేదికను సమర్పించింది. కెనడా ప్రభుత్వం తాము చేసిన తప్పులను అంగీకరిచి భారత్‌కు క్షమాపణలు కూడా తెలిపింది. మార్క్ కార్నీ ప్రధానిగా ఎన్నికైన తరువాత, భారత్‌తో పునఃసంబంధాలపై చర్చలు జరిపేందుకు కృషి చేస్తామన్నారు. కానీ హార్పర్ అభిప్రాయం ప్రకారం, సంబంధాల పునరుద్ధరణకు తొలి అడ్డంకి వేర్పాటువాద శక్తులతో కొనసాగుతున్న అనైతిక సంబంధాలే. వాటిని తొలగించకుండా భారత్‌తో బలమైన, సుస్థిర సంబంధాలు కొనసాగించలేమని ఆయన స్పష్టంగా చెప్పారు. భారత్‌ను గౌరవించే దేశంగా కెనడా మిగలాలంటే, రాజకీయ నేతలు మితి మీరిన వేర్పాటువాద భావజాలానికి దూరంగా ఉండాలని హార్పర్ విజ్ఞప్తి చేశారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన సంబంధాల పునరుద్ధరణకు ఇది అత్యవసర చర్యగా అభివర్ణించారు.
Read Also: Kamal Haasan : మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు : కమల్ హాసన్‌కు హైకోర్టు ప్రశ్న