Site icon HashtagU Telugu

Delimitation : కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తిరిగి తక్కువ పొందుతున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి

Re-Division Second Meeting

Re-Division Second Meeting

Delimitation : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నపై మ‌నంద‌రిని ఏక‌తాటిపై తెచ్చిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి  స్టాలిన్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు. పున‌ర్విభ‌జ‌న‌పై మ‌నం అభిప్రాయాలను పంచుకోవాలి. ఈ విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా ఇక్క‌డ నా అభిప్రాయాల‌ను మీతో పంచుకుంటున్నా అని రేవంత్ అన్నారు.

ప్ర‌స్తుతం దేశం పెద్ద స‌వాల్‌ను ఎదుర్కొంటోంది. బీజేపీ జ‌నాభా జ‌రిమానాల విధానాన్ని కొన‌సాగిస్తోంది. 1971లో జ‌నాభాను నియంత్రించాల‌ని దేశం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేస్తే ఉత్త‌రాదిలోని పెద్ద రాష్ట్రాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యాయి. ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌, మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మంచి ప్ర‌గ‌తి సాధించాయి అన్నారు.

Read Also: Shah Rukh Message: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షారుక్ కీలక సందేశం

తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించాం. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించాం. తెలంగాణలో సుపరిపాలనతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం. రూపాయి చెల్లిస్తే.. తెలంగాణకు 42 పైసలు తిరిగొస్తున్నాయి. తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే లభిస్తున్నాయి. కానీ, బిహార్‌ మాత్రం రూపాయికి రూ.6.06 పొందుతోంది. యూపీకి రూ.2.03, మధ్యప్రదేశ్‌కు రూ.1.73 మేర లభిస్తోంది అని రేవంత్‌రెడ్డి వివరించారు.మ‌నది ఒకే దేశం.. మ‌నం దానిని గౌర‌విస్తాం. కానీ ఈ పున‌ర్విభ‌జ‌న‌ను మ‌నం అంగీక‌రించం. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ కుదింపు. మంచి ప్ర‌గ‌తి సాధిస్తున్న రాష్ట్రాల‌ను ఈ ప్ర‌క్రియ శిక్షిస్తోంది. ఈ అస‌మ‌గ్ర‌మైన పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌కుండా మ‌నం బీజేపీని అడ్డుకోవాలి.

నా మొద‌టి పాయింట్‌ సీట్లు పెంచొద్దు.. ఉన్న సీట్ల‌తోనే పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అలానే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టింది. లేకుంటే రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ తేడాలు (అస‌మ‌తౌల్యాలు) వ‌చ్చేవి అన్నారు. 2001లో ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను అలానే ప్రారంభించింది. లోక్‌స‌భ సీట్ల‌ను అదే సంఖ్య‌లో ఉంచుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అదే విధంగా చేయ‌గ‌ల‌రా? అన్నారు.

నా రెండో పాయింట్‌ జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక పున‌ర్విభ‌జ‌ను ద‌క్షిణాది వ్య‌తిరేకిస్తోంది. బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న జ‌నాభా దామాషా ప‌ద్ద‌తిలో పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ద‌క్షిణాది రాష్ట్రాలైన మ‌నం రాజ‌కీయ గ‌ళం కోల్పోతాం. మ‌న‌ల్ని ఉత్త‌రాది ద్వితీయ శ్రేణి పౌరులుగా త‌గ్గించివేస్తుంది. జ‌నాభా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌త్యం చ‌లాయిస్తాయ‌ని ఇక్క‌డ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ అంగీకరిస్తారు. ఏ ప‌రిస్థితుల్లోనూ మ‌నం దీనికి అంగీక‌రించ‌కూడ‌దు. బీజేపీ అనుస‌రిస్తున్న ఈ విధానానికి వ్య‌తిరేకంగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు, పార్టీలు, నాయ‌కులు ఏకం కావాలి అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

మూడో పాయింట్‌ ప్రొరేటా విధానాన్ని అంగీక‌రించ‌లేం. ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాదికి న‌ష్ట‌మే క‌లిగిస్తుంది. ప్రొరేటా ప్ర‌క్రియ కూడా రాజ‌కీయ అంత‌రాల‌ను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మ‌ధ్య తేడా కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటును నిర్ణ‌యిస్తుంది.. ఒక్క సీటు కూడా తేడాను చూపుతుంది. ఒక్క సీటుతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌డిపోయిన చ‌రిత్ర మ‌న దేశంలో ఉంది. కాబ‌ట్టి ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాది రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తుంది. మ‌రి మ‌నం అంగీక‌రించే ఆప్ష‌న్లు ఏమిటంటే నా సింపుల్ విశ్లేష‌ణ ఏమంటే? ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోcw మాజీ ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ విధానాన్ని పాటించ‌డ‌మే. మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ సీట్ల‌లో ఎటువంటి మార్పు తీసుకురావ‌ద్దు అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read Also: Delimitation : ప్రధాని మోడీకి వైఎస్‌ జగన్ లేఖ