RussiaUkraine War: ప‌ర్‌ఫెక్ట్ ప్లాన్‌తో బ‌రిలోకి దిగిన.. పుతిన్ అంచ‌నాలు త‌ప్పాయా..?

  • Written By:
  • Publish Date - February 28, 2022 / 04:45 PM IST

ఉక్రెయిన్, ర‌ష్యాల మ‌ధ్య మొద‌లైన యుద్ధం నేటితో ఐద‌వ రోజుకు చేరుకుంది. మొద‌ట ఉక్రెయిన్ శాంతిచ‌ర్చ‌ల కోసం ప్ర‌య‌త్నించ‌గా, ర‌ష్యా మాత్రం బాంబ‌లు వ‌ర్షం కురిపిస్తూ ఉక్రెయిన్‌లోకి చొచ్చుకుని వెళ్ళింది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రాన్ని ల‌క్ష్యంగా చేసుకున్న ర‌ష్యా సైనిక ద‌ళాలు, అక్క‌డ ఉక్రెయిన్ సైన్యంతో పాటు పౌరులపై కూడా విచక్షణ లేకుండా దాడికి పాల్పడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ ప్ర‌జ‌లు ప్రాణ భ‌యంతో బంక‌ర్ల‌లో త‌ల‌దాచుకుంటున్నారు.

ఇక ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం ప్రారంభం కాక‌ముందే ప్రపంచ దేశాలు సైతం ముందుకు వచ్చి రష్యాను వారించాయి. అయితే ర‌ష్యా అధ్య‌క్ష‌డు పుతిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్ పై దండ‌యాత్ర కొన‌సాగిస్తున్నాడు. దీంతో ర‌ష్యా పై పశ్చిమ దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చర్యలను అమెరికా, నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ప్రపంచ దేశాల ఆంక్షలు, హెచ్చరికల్ని ఏమాత్రం లెక్క‌చేయ‌లేదు పుతిన్.

ఈ క్ర‌మంలో తమ బలగాలను మరింత లోపలికి దూసుకుపోయేలా ఆదేశాలిచ్చారు. మ‌రోవైపు ఉక్రెయిన్ కూడా దీటుగా రష్యా బలగాలను ఎదుర్కొంటుంది త‌మ దేశంలోకి దూసుకొస్తున్న రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్‌ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. దీనివల్ల పుతిన్‌ సేన పెద్ద సంఖ్యలో సైనికులు, ఆయుధ వ్యవస్థలను నష్టపోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్ సైనం ధీటుగా స్పందిస్తుండ‌డంతో, గ‌త రెండు రోజులుగా ర‌ష్యా సైకిక బ‌ల‌గాలు అడుగు ముందుకు వేయ‌లేక‌పోతున్నాయి.

దీంతో ఇలాంటి ప‌రిణామం ఊహించ‌ని పుతిన్‌కు ఉక్రెయిన్ సైనికుల చ‌ర్య‌లు మింగుడు ప‌డ‌డంలేద‌ని స‌మాచారం. ఇక ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించుకునేందు పుతిన్‌ మోహరించిన ల‌క్ష‌న్న‌ర‌మంది సైనికుల్లో 1.5 లక్షల మంది సైనికుల్లో కనీసం సగం మంది ఇప్పటికే ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినా, ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా ఎదురుదాడి చేస్తుండ‌డంతో ఆక్రమణ అంత సునాయాసంగా జరగడంలేద‌ని, అదే ఇప్పుడు పుతిన్‌కు ఇరిటేట్ తెప్పిస్తోంద‌ని స‌మాచారం.

ఉక్రెయిన్‌తో పోలిస్తే, రష్యాకు సైనిక సామ‌ర్థ్యం ఎక్కువ. ట్యాంకు, యుద్ధవిమానాలు, బలగాల సంఖ్య, ఇలా ఏ అంశంలో చూసినా ఉక్రెయిన్ పై రష్యాకు స్ప‌ష్ట‌మైన ఆధిప‌త్యం ఉంది. అయితే ఉక్రెయిన్ సైనికులు భీక‌రంగా పోరాడుతుండ‌డంతో, పెద్ద సంఖ్యలో ర‌ష్యా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా సైనికులు కొందరు ఖైదీలుగా దొరికిపోతుండ‌గా, మ‌రోవైపు ర‌ష్యా ఆయుధ సంప‌త్తి కూడా ధ్వంస‌మ‌వుతోంది. దీంతో ప‌క్కా ప్లాన్‌తో యుద్ధానికి దిగినా, పుతిన్ అంచ‌నాలు త‌ప్పాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.