Hindi Language Controversy:హిందీ భాషపై ట్వీట్ వార్.. సుదీప్ కామెంట్స్ కు రాజకీయ మద్దతు వెనుక అసలు ఉద్దేశమేంటి?

భాష ఘోష హద్దులు దాటుతోంది. కన్నడ నేల నుంచి ఢిల్లీ గల్లీ వరకు మంట రాజేస్తోంది.

  • Written By:
  • Publish Date - April 29, 2022 / 11:55 AM IST

భాష ఘోష హద్దులు దాటుతోంది. కన్నడ నేల నుంచి ఢిల్లీ గల్లీ వరకు మంట రాజేస్తోంది. కన్నడ హీరో సుదీప్ కు, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కు మధ్య రాజుకున్న ట్వీట్ల యుద్ధం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. అలాంటి దానిని ఎలా క్యాష్ చేసుకోవాలో రాజకీయనేతలకు పెద్దగా చెప్పక్కరలేదు. అందుకే హిందీ జాతీయ భాష కాదన్న కిచ్చా సుదీప్ కు కన్నడ నేతలు మద్దతిస్తున్నారు. వారి సపోర్ట్ వెనుక అసలు
ఉద్దేశమేంటి?

హిందీ జాతీయ భాష కాదని సుదీప్ ఈమధ్య ఓ సినిమా వేడుకలో అన్నాడు. దానికి అజయ్ దేవగణ్ స్పందిస్తూ.. హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను అందులోకి డబ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తున్నారని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు. దానికి సుదీప్ కూడా అంతే సౌమ్యంగా, హుందాగానే జవాబిచ్చాడు. అలా ట్వీట్ల వార్ నడుస్తోంది. కానీ మధ్యలో రాజకీయనేతలతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా
ఎంటరయ్యారు.

సుదీప్ వ్యాఖ్యల్లో వాస్తవముందన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్నారు మాజీ సీఎం సిద్ధరామయ్య. కన్నడతోపాటు తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ లాగే.. హిందీ కూడా ఒక భాష మాత్రమే అన్నారు మాజీ సీఎం కుమారస్వామి. అజయ్ నటించిన పూల్ ఔర్ కాంటే సినిమా బెంగళూరులో ఏడాది పాటు నడిచిందని ఆయనకు గుర్తు చేశారు కుమారస్వామి.
దేశంలో 19,500 భాషలున్నాయని వాటన్నింటికీ దేశంలో సమ ప్రాధాన్యత ఉందన్నారు. భారత్ వైవిధ్యమైన దేశం.. అలాంటి దేశంలో ఒక్క భాషకే ప్రాధాన్యత కుదరదన్నారు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.కరెన్సీ నోటు పై అనేక భాషలకు చోటు ఉన్నప్పుడు ఒక్క భాషకే ఎలా ప్రాధాన్యత ఇస్తారన్నారు.

దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయని అందుకే ఉత్తరాది తారలు అసూయ పడుతున్నారన్నారు రామ్ గోపాల్ వర్మ. వీరందరి కామెంట్స్ తో ఈ వివాదం భాషల మధ్య యుద్ధంలా మారిపోయింది.