Sonia Vs Smriti: స్మృతిఇరానీ X సోనియా గాంధీ.. ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై దుమారం!

జరిగిందంటే రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు.

  • Written By:
  • Updated On - July 28, 2022 / 06:11 PM IST

ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్ సహా విపక్షాలకు అధీర్ రంజన్ చౌదరి రూపంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అసలు ఏం జరిగిందంటే రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్‌ అవమానించిందనీ, కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్మృతి ఇరానీ మండిపడ్డారు.

దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చినట్లు అయ్యిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకానొక టైంలో బీజేపీ సభ్యులంతా లేచి.. స్మృతి ఇరానీకి మద్ధతుగా గళం వినిపించారు. ఆ దశలో కేంద్రమంత్రి స్మృతి ఇరానిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీరియస్ అయ్యారు. నువ్వు నాతో మాట్లాడకు అంటూ గట్టిగా అరిచారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీ మహిళా ఎంపీలను సోనియా బెదిరించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అధిర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్దల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడంలేదన్నారు నిర్మలా సీతారామన్‌. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్‌ రంజన్‌ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. తన ‍వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ ఆవేశంగా మాట్లాడారాయన. ఇప్పటికే అధిర్‌ రంజన్‌ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు. పార్లమెంట్‌ ఆవరణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తోటి ఎంపీలతో కలిసి ఫ్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధిర్‌ రంజన్‌వి సెక్సీయెస్ట్‌ కామెంట్లు అని, ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానమంటూ ఆమె మండిపడ్డారు. మొత్తం మీద రాష్ట్రపతిపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యల వివాదం స్మృతి ఇరానీ, సోనియా గాంధీ మధ్య వ్యక్తిగత దూషణల పర్వానికి తెరతీసినట్టయింది.