Kiren Rijiju : వక్ఫ్ బిల్లు బుధవారం రోజున లోక్‌సభ ముందు రాబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. వక్ఫ్ బిల్లు పార్లమెంట్‌కు రాబోతున్న నేపథ్యంలో, బుధవారం ఉదయం రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ముస్లిం సమాజం హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, ఈ బిల్లును అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది.
Read Also: Painting Exhibition: రూ.వెయ్యికే 8.5 కోట్ల విలువైన చిత్రం.. తలలు పట్టుకున్న నిర్వాహకులు
ఇక, ఈరోజు లోక్ సభలో అధికార, విపక్షాల మధ్య మాటాల యుద్ధం నడిచింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంతో పాటు వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చే బిల్లుపై చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షాలు వాకౌట్ ను ఒక సాకుగా చెబుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుపై చర్చించేందుకు ఎనిమిది గంటలు కేటాయించింది అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ బిల్లుకు క్రైస్తవ సమాజం కూడా మద్దతు ఇస్తోంది అని గుర్తు చేశారు.
కేరళకు చెందిన కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజ ప్రయోజనాలకు విరుద్ధమని అభివర్ణించిందని ఆయన తెలిపారు. ఇక, ఏప్రిల్ 4వ తేదీతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రేపు వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం యోచిస్తుంది. వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలిచినట్లు వెల్లడైంది. మరొక వైపు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సభ్యులందరూ రేపు సభకు హాజరుకావాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.