Voting – Ram Lalla Idol : అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది. ఈ మహా ఘట్టం దిశగా మరో కీలక ముందడుగు ఇవాళ పడనుంది. అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఇవాళ ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నారు. నిష్ణాతులైన శిల్పులు మూడు భిన్నమైన నమూనాల్లో శ్రీరాముడి మూడు వేర్వేరు విగ్రహాలను తయారు చేశారు. ఈరోజు వీటిలో నుంచే ఒక దాన్ని గర్భగుడిలో ప్రతిష్టించేందుకు సెలెక్ట్ చేస్తారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరిగే ఈ ఓటింగ్ ప్రక్రియలో హెరిటేజ్ సైన్సు నిపుణులు, శిల్ప కళా నిపుణులు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలతో కూడిన టీమ్ పాల్గొంటుంది. వీరిలో ఎక్కువ మంది ఏ విగ్రహం వైపు మొగ్గుచూపుతారో దాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు స్వీకరిస్తారు. మిగతా విగ్రహాలను ఆలయంలో వేరేచోట ప్రతిష్ఠిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘మూడు కూడా బాల రాముడి విగ్రహాలే. అవన్నీ 51 అంగుళాల హైట్‌తో ఉంటాయి. ఐదేళ్ల బాలరాముడిని తలపించేలా వాటిని తయారు చేశారు. వీటిలోనే ఒకదాన్ని ఎంపిక చేసి జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తాం. ఇవాళ జరిగే ఓటింగ్‌లో(Voting – Ram Lalla Idol) బాల రాముడి దైవత్వాన్ని కళ్లకు కట్టేలా ఉండే విగ్రహాన్ని ఎంపిక చేస్తాం’’ అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
Also Read: January 1st – 4 Rules : న్యూ ఇయర్ 2024లో.. 4 న్యూ రూల్స్
ఆలయ ప్రారంభోత్సవ తేదీ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో రామజన్మభూమి మార్గం, ఆలయ సముదాయంలో జరుగుతున్న నిర్మాణ పనులను శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంపై కంటే నాణ్యత చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కాగా, జనవరి 16 నుంచి ఏడు రోజుల పాటు అయోధ్య రామమందిరంలో పవిత్రోత్సవం జరుగుతుంది. జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలో బాలరాముడి విగ్రహం ఊరేగింపు ఉంటుంది. జనవరి 22న ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాల రాముడు అయోధ్య మందిరంలో కొలువు తీరుతాడు.