Site icon HashtagU Telugu

Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో 6 రాష్ట్రాల ఓటర్లు..!

Maharashtra Election Result

Maharashtra Election Result

కన్నడ (Karnataka) నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర కానుంది. ఆరు రాష్ట్రాల ఓటర్ల మీద అధికారం ఆధారపడింది. కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) ఒక పార్టీ విజయం సాధించాలంటే కన్నడిగుల ఓట్లు మాత్రం పడితే చాలనుకుంటే పొరపాటు పడ్డట్లే. దశాబ్దాలుగా కన్నడ నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరే ఇతర రాష్ట్రానికి లేని విదంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఏకంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి.

దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వలసలు ఎక్కువే. బెంగుళూరు వంటి మహానగరంలో వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో ఉన్నారు. రాష్ట్రంలో 65.45 లక్షల మందివరకు వలసదారులు ఉన్నారు. వీరి ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ సారి ఎన్నికల బరిలో కూడా ఎందరో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు మూలాలున్న వారు 100 మంది, మరాఠా మూలాలున్న వారు 50 మందికి పైగా, తమిళులు 10 మంది వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Also Read: Karnataka Election 2023 : ఇవాళ ప్రచార బరిలోకి సోనియా

బెంగళూరులో ఎవరి జనాభా ఎంత?

రాజధానిలో 44 శాతం కన్నడిగులు ఉంటే 56 శాతం ఇతర భాషా ప్రజలు ఉన్నారు. తెలుగు వారు అత్యధికంగా 25–30 లక్షల మంది ఉన్నారు. తమిళులు 16–17 లక్షల మంది ఉంటే మళయాలీలు 4–5 లక్షలు ఉన్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల జనాభా 11–12% ఉన్నారు.రాజస్తాన్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో జార్ఖండ్, త్రిపుర నుంచి కూడా వలసలు పెరిగాయి. రాజస్తాన్‌కు చెందిన జైన సామాజికవర్గం ప్రజలు బెంగళూరులో చాలా చోట్ల నివసిస్తూ ఎన్నికల్లో నిర్ణయాకత్మకమైన పాత్రను పోషిస్తున్నారు.కర్ణాటకలో దాదాపుగా 40–50 అసెంబ్లీ స్థానాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రంలో సుమారు కోటి మంది వరకు తెలుగు ప్రజలు కర్ణాటకలో నివసిస్తున్నట్లు అనధికారిక సమాచారం. పలు దశాబ్దాలుగా వివిధ కారణాలతో కర్ణాటకకు వచ్చి ఇక్కడి కన్నడిగులతో మిళితమై తెలుగు వారు జీవనం సాగిస్తున్నారు.

Also Read: Manipur: మణిపూర్ హింసాకాండలో ఇద్దరు అధికారులు మృతి

ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని నిర్వహిస్తున్న వారిలో అధిక భాగం తెలుగు ప్రాంత ప్రజలే కావడం గమనార్హం. ఒక్క బెంగళూరులోనే సుమారు 25 లక్షలకు పైగా తెలుగు వారు ఉన్నారు. కర్ణాటకలో కన్నడ, ఉర్దూ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. బెంగళూరులోని కేఆర్‌ పురం, రామ్మూర్తినగర, హెబ్బాళ, మారతహళ్లి, మహదేవపుర, యలహంకా, దేవనహళ్లితో పాటు ఏపీ, తెలంగాణ సరిహద్దు కలిగిన బళ్లారి జిల్లా, బీదర్, కలబురిగి, రాయచూరు, యాదగిరి, బసవకల్యాణ, కోలార, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నారు. 1947లో ఏర్పడిన మైసూరు రాష్ట్రానికి తెలుగు వ్యక్తి క్యాసంబల్లి చెంగరాయరెడ్డి ఎన్నికయ్యారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డాక ఎందరో తెలుగువారు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.

కర్ణాటకకు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వలసదారులు గుర్తింపు సమస్యని అధికంగా ఎదుర్కొంటున్నారు. 65 లక్షల మంది వలసదారుల్లో ఎంత మందికి కర్ణాటకలో ఓటు హక్కు ఉందో అన్న దానిపై స్పష్టమైన గణాంకాలేవీ లేవు. కార్మికులుగా పని చేస్తున్న వారికి తాగు నీరు, ఉండడానికి ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్‌ వంటివన్నీ సమస్యలుగానే ఉన్నాయి. టీ, కాఫీ తోటల్లో పని చేస్తున్న కూలీలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అధికార బీజేపీ వీరిని సంప్రదిస్తూ రేషన్‌ కార్డులు ఇప్పించడం, ప్రభుత్వం పథకాలు వారికి అందేలా చూస్తామని హామీలు ఇస్తోంది. వలసదారుల ఓట్లను రాబట్టేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన హార్దిక్‌ పటేల్‌ సహా వివిధ రాష్ట్రాల యువ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా వివిధ భాషలకు చెందిన వారి ఓట్లను రాబట్టేందుకు ఆయా రాష్ట్రాల నాయకుల్ని ప్రచార పర్వంలోకి తీసుకువచ్చింది.