Kerala : విజింజం పోలీస్ స్టేషన్ పై నిరసనకారుల దాడి. పోలీసులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్ ధ్వంసం..!!

  • Written By:
  • Updated On - November 28, 2022 / 07:09 AM IST

కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాని ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన  హింసాకాండలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అర్థరాత్రి విటింజం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ఆందోళనకారులు. అనేకమంది పోర్ట్ వ్యతిరేక నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడిచేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. రెండు పోలీసు జీపులను ఆందోళనకారులు నిప్పంటించారు. అంబులెన్స్ లను కూడా అడ్డుకున్నారు నిరసనకారులు.

విజింజంలో భారీగా చొచ్చుకొచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోలేకపోయారు. దీంతో పరిస్థితి చేజారిపోయింది. టియర్ గ్యాస్ షెల్స్ ను విసిరారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని నిరసనకారులు తేల్చి చెప్పారు. దీంతో మరింత మంది బలగాలను రంగంలోకి దింపారు. తిరువనంతపురం సిటీ పోలీసు కమిషనర్ వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఎల్ డిఎఫ్ ప్రభుత్వం అదానీతో కలిసి విజింజలో పోర్టుపై భారీ కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలతో నిరసనలు చేపట్టారు. లాటిన్ చర్చి నేత్రుత్వంలో నవంబర్ 26న ఓడరేవు సైటుకు గ్రానైట్ ను తీసుకెళ్తున్న 25 ట్రక్కులను అడ్డుకోవడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో లాటిన్ ఆర్చ్ బిషప్ ఫాదర్ థామస్ ను నిందితుడిగా పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 5గురి అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలంటూ నిరసనకారులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు.