Vinesh Phogat : దేశ ప్రజలు రోడ్లపై కూర్చొని నిరసన తెలిపే పరిస్థితులుంటే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రముఖ ఒలింపియన్ వినేష్ ఫోగట్ ప్రశ్నించారు. తమ లాంటి రైతుబిడ్డలు క్రీడల్లో దేశం కోసం ఎంత పెద్దస్థాయిలో ప్రాతినిధ్యం వహించినా.. తమ కుటుంబాలను ఇలాంటి దుస్థితిలో చూసి నిస్సహాయంగా మిగిలిపోతుంటామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రైతులు లేనిదే ఎవరూ లేరు. వాళ్లు తిండి పెట్టనిదే ఎవరూ ఏమీ చేయలేరు’’ అని వినేష్ ఫోగట్(Vinesh Phogat) పేర్కొన్నారు. శంభు సరిహద్దులోని రైతుల నిరసన శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈసందర్భంగా రైతులకు తన సంఘీభావాన్ని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
పంటలకు కనీస మద్దతు ధరను కోరుతూ రైతులు చేపట్టిన నిరసన శనివారంతో 200 రోజులకు చేరుకుంది. ఖనౌరీ, శంభు, రతన్ పురా సరిహద్దుల్లో రైతుల నిరసనలు జరుగుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరపై ఇచ్చిన మాటను కేంద్ర ప్రభుత్వం నిలుపుకోవాలని వినేష్ ఫోగట్ డిమాండ్ చేశారు. ‘‘సాగు చట్టాలపై గతంలో కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే అంతటితో ఊరుకోకుండా రైతులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి’’ అని ఆమె కోరారు. “రైతులు ఇక్కడ కూర్చొని 200 రోజులైంది. ఇది చూస్తుంటే బాధేస్తోంది. వీళ్లంతా ఈ దేశ పౌరులే. ప్రభుత్వం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని వినేష్ ఫోగట్ తెలిపారు. ఈసందర్భంగా ఆమెను రైతు సంఘాల నాయకులు సన్మానించారు.
Also Read :Putin : మంగోలియాకు పుతిన్.. అరెస్టు చేసి ఐసీసీకి అప్పగిస్తారా ?
ఇటీవలే రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిని రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి. ఆమె వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. మరోవైపు కంగనకు ఇటీవలే బీజేపీ హైకమాండ్ కూడా మొట్టికాయలు వేసింది. అలాంటి వ్యాఖ్యలు రైతులపై చేయొద్దని హితవు పలికింది. కంగన చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని పేర్కొంటూ బీజేపీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.