Vinesh Phogat : స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరు బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వారు ప్రకటించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేస్తారని సమాచారం.ప్రస్తుతం ఈ అసెంబ్లీ సీటు నుంచి జన్ నాయక్ జనతా పార్టీ నేత అమర్జీత్ ధందా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బజ్రంగ్ పునియా ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
We’re now on WhatsApp. Click to Join
బజ్రంగ్ పునియా, వినేష్ ఫోగట్‌ల(Vinesh Phogat) చేరికతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా కలిసొస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. 2014 నుంచి హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనేందుకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌కు వీరిద్దరి చేరిక అదనపు బలాన్ని అందించనుంది. ఇటీవలే శంభూ బార్డర్‌కు వెళ్లిన వినేష్ ఫోగట్ రైతుల దీక్షకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. రైతుల డిమాండ్లను ఆలకించాలని, వాటిని నెరవేర్చాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో అప్పట్లోనే ఆమె కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ అంచనాలను నిజం చేస్తూ ఇవాళ మధ్యాహ్నం వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నేత బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లలో వినేష్ ఫోగట్ కూడా ఉన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ పదవి నుంచి తప్పించింది. ఇటీవలే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. ఉండాల్సిన దాని కంటే ఒక కిలో శరీర బరువు ఎక్కువగా ఉందని చెబుతూ ఆమెను పోటీ నుంచి తప్పించారు. దీంతో వినేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భారత్‌కు రెజ్లింగ్ విభాగంలో రావాల్సిన పతకం చేజారింది.