Vikash Yadav : అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుట్రలో భారత్‌కు చెందిన గూఢచార సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) మాజీ ఉద్యోగి వికాస్ యాదవ్ (39) హస్తం ఉందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై అమెరికా అనవసర రాద్ధాంతం చేస్తున్న తరుణంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Also Read :Dhana Trayodashi : 29న ధన త్రయోదశి.. ఆ రోజు యమదీపం వెలిగించడం వెనుక పురాణగాథ ఇదీ
వికాస్ యాదవ్ గతంలో భారత ప్రభుత్వ అధికారిగా అమెరికాలో విధులు నిర్వర్తించేవారు. అమెరికాలోని భారత విదేశీ ఇంటెలీజెన్స్ విభాగం, రా విభాగాలను నిర్వహించే కేబినెట్ సెక్రటేరియట్‌లో ఆయన ఉద్యోగిగా సేవలు అందించేవారు. అయితే వికాస్‌ను, ఆయన అనుచరుడిని 2023 సంవత్సరం డిసెంబరు 18న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వికాస్ (Vikash Yadav) తనను నగరంలోని ఓ హోటల్‌కు పిలిచి.. దాడి చేయడంతో పాటు కిడ్నాప్, దోపిడీకి యత్నించాడని ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగానే వికాస్ యాదవ్‌పై కేసును నమోదు చేసి, అరెస్టు చేశారని ఆయా కథనాల్లో ప్రస్తావించారు. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్ దాఖలైన మరుసటి నెలలోనే వికాస్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది.
Also Read :Drone Attack : ప్రధాని నివాసంపై డ్రోన్ ఎటాక్.. ఏం జరిగిందంటే.. ?
అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర కేసును అతడు ఎదుర్కొంటున్న వేళ ఈవివరాలు వెలుగులోకి రావడం గమనార్హం. వికాస్ యాదవ్ పరారీలో ఉన్నాడని అమెరికా అంటుండగా.. ఇప్పుడు అతడి ఆచూకీపై క్లారిటీ రావడం కీలకమైన అంశం. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుంది ? వికాస్ యాదవ్ అప్పగింతకు భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతుందా ? అనేది వేచిచూడాలి. మరోవైపు అమెరికాలోని న్యూయార్క్ కోర్టులోనూ వికాస్‌యాదవ్‌పై ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలైంది. మనీలాండరింగ్ చేయడం, పన్నూ హత్యకు కుట్ర పన్నేందుకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం వంటి అభియోగాలను అమెరికా దర్యాప్తు సంస్థలు మోపాయి. వికాస్‌యాదవ్ అమెరికాలో విధుల్లో ఉండగా.. పన్నూను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తాతో కలిసి కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తోంది. చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్న నిఖిల్‌ను ఇటీవలే అమెరికాకు అప్పగించారు. ఈ కేసు వ్యవహారంపై ఇటీవలే భారత ప్రభుత్వానికి అమెరికాలోని న్యూయార్క్ కోర్టు సమన్లు జారీ చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై భారత్ అప్పట్లో మండిపడింది.