Vijayashanti: శశికళ, విజయశాంతి సీక్రెట్ మీటింగ్? ఇది.. బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లానా?

తమిళనాడులో రాజకీయాలు మారనున్నాయా? ఎందుకంటే జయలలిత మరణం తరువాత రాజకీయంగా అష్టకష్టాలు పడుతున్న శశికళ..

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 10:56 AM IST

తమిళనాడులో రాజకీయాలు మారనున్నాయా? ఎందుకంటే జయలలిత మరణం తరువాత రాజకీయంగా అష్టకష్టాలు పడుతున్న శశికళ.. మళ్లీ పాలిటిక్స్ లో చక్రం తిప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గుళ్లు,గోపురాలు తిరుగుతూ తనకు మద్దతిచ్చేవారింట్లో కార్యక్రమాలకు కూడా వెళుతున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి, చిన్నమ్మ రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది.

తమిళనాడులో రాబోయే ఎన్నికల కోసం రూటుమ్యాపు ఎలా ఉంటే బాగుంటుంది అన్నదానిపై ఆమె విజయశాంతితో చర్చించినట్లు సమాచారం. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక కొంతమంది నేతలు ఆమెను కలుసుకున్నారు. వారిలో విజయశాంతి కూడా ఉన్నారు. అప్పుడే చిన్నమ్మ తన రాజకీయ భవిష్యత్ కోసం చర్చించారన్నారు. అయితే వీరిద్దరి భేటీ బీజేపీ పెద్దల సూచనల మేరకే జరిగిందా లేదా అన్నది స్పష్టం కాలేదు.

జయలలిత మృతి తరువాత అన్నాడీఎంకేపై బీజేపీ పట్టు పెంచింది. కీలకమైన నిర్ణయాల్లో తన ప్రమేయం ఉండేలా చూసుకుంది. అది నచ్చక కొంతమంది నేతలు అన్నాడీఎంకేను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు అలాంటివారందరినీ మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శశికళకు కావలసింది కూడా అదే. పార్టీ పరిస్థితిని బీజేపీ చేతులమీదుగా చక్కబెట్టిన తరువాత.. తాను పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆమె భావిస్తున్నారు. కానీ దానికి అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం అంగీకరిస్తారా లేదా అన్నది చెప్పలేం. మరోవైపు సంక్షేమ పాలనతో ముఖ్యమంత్రి స్టాలిన్ దూసుకుపోతున్నారు.

తమిళనాడులో రాజకీయాలు ఇంత హాట్ హాట్ గా ఉన్న సమయంలో చిన్నమ్మ, విజయశాంతిల భేటీ రాజకీయంగా కీలకంగా మారింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు రావాలంటే రాజకీయ పునరేకీకరణ తప్పదు. అందుకే ఆ విషయాలపై చర్చించడానికే విజయశాంతి, చిన్నమ్మలు మీటింగ్ పెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది.