Site icon HashtagU Telugu

Vijay Mallya : ఇదే లాస్ట్ ఛాన్స్‌.. విజ‌య్ మాల్యాను హెచ్చ‌రించిన కోర్టు

Vijay Mallya

Vijay Mallya

భార‌త బ్యాంకుల‌కు వేల‌కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి యూకేలో ఎంజాయ్ చేస్తున్న విజ‌య్‌మాల్యాకు (Vijay Mallya) అత్యుత‌న్న న్యాయ‌స్ధానం లాస్ట్ చాన్స్ ఇచ్చింది. రెండు వారాల్లోగా(ఫిబ్ర‌వ‌రి 24) కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశించింది. ఇది చివరి అవకాశం అంటూ ధర్మాసనం (Supreme Court Of India) స్పష్టం చేసింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ, కుమారుడు, కుమార్తెలకు 40 మిలియన్‌ డాలర్లను బదిలీ చేశారు మాల్యా. దీంతో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం (Banks Consortium) సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, మాల్యాను కోర్టు ధిక్కరణ కింద దోషిగా తేలుస్తూ 2017 మే నెలలో తీర్పు చెప్పింది. కానీ, అప్పటికే విజయ్ మాల్యా లండన్‌ (London) పారిపోయారు. ఆ తర్వాత ఆయన భారత్‌కు తిరిగి రాలేదు. అదే సమయంలో విజయ్‌ మాల్యాను దివాలాదారుగా ప్రకటించింది లండన్‌ కోర్టు. మాల్యాకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియంకు గతంలోనే అనుమతి ఇచ్చింది. దీంతో నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకున్నారాయన. ఇన్ని సంవత్సరాలు ఆయన తలదాచుకుంటూ వస్తోన్న లండన్‌లోని విలాసవంతమైన బంగళా కూడా మాల్యా చేజారిపోయింది. అటు వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకారం తెలిపింది బ్రిటన్‌ ప్రభుత్వం. కానీ పలు కారణాలు చెబుతూ విజయ్‌ మాల్యా అక్కడే తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.