Site icon HashtagU Telugu

Jagdeep DhankarL : ఉపరాష్ట్రపతికి అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

Vice-Presidential Election

Vice-Presidential Election

Jagdeep DhankarL : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆదివారం ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను తెల్లవారుజామున 2 గంటలకు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (AIIMS)కు తీసుకెళ్లారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్‌ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.

Read Also: Airports : ఏపీలో మరో 2 విమానాశ్రయాలు.. ?..పరిశీలనకు సన్నాహాలు

మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆసుపత్రిలో చేరిన విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ధంకర్ ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత వైద్యులకు సూచించారు. అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలను వెంటనే అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ధంకర్ అనారోగ్యంపై పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. త్వరగా ఆయన కోలుకోవాలని కుటుంబ సభ్యులు, మిత్రులు, అనుచరులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉప-రాష్ట్రపతిగా 2022లో ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి, ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. సీఎంవో, రాజ్‌భవన్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పులా పరిస్థితి ఉండేది. ఈ వివాదంతోనే జగదీప్ ధన్‌ఖడ్‌ పేరు మీడియాకెక్కింది.

Read Also: Janasena : అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించిన నాగబాబు