Vande Bharat Express: వందే భారత్ రైలుకు మళ్లీ ప్రమాదం.. రెండు నెలల వ్యవధిలోనే నాలుగో ఘటన

వందేభారత్ రైలును పశువులు ఢీకొట్టే ప్రక్రియ ముగిసేలా కనిపించడం లేదు.

  • Written By:
  • Updated On - December 2, 2022 / 09:23 AM IST

వందేభారత్ రైలును పశువులు ఢీకొట్టే ప్రక్రియ ముగిసేలా కనిపించడం లేదు. వందే భారత్ రైలు వరుస ప్రమాదాలకు కారణం అవుతూనే ఉంది. వందేభారత్ రైలు గురువారం మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయంత్రం గుజరాత్‌లోని ఉద్వాడ- వాపి స్టేషన్ల మధ్య గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ పశువులను ఢీ కొట్టింది. దీంతో రైలు ముందు ప్యానెల్‌కు చిన్నపాటి డెంట్‌ ఏర్పడింది. కొద్దిసేపు ఆగిన తర్వాత రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది. రెండు నెలల వ్యవధిలోనే ఇది నాలుగో ప్రమాదం కావడం విశేషం.

పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్వాడ- వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో గురువారం సాయంత్రం 6.23 గంటలకు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. కాసేపు ఆగిన తర్వాత మళ్లీ సాయంత్రం 6.35 గంటలకు రైలు బయలుదేరింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పశువులను ఢీకొట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా వందే భారత్‌ మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అంతకుముందు అక్టోబరు 29న ఉదయం 8 గంటలకు అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎద్దును ఢీకొంది. అక్టోబర్ 6న కూడా భారత వందే భారత్ ప్రమాదానికి గురైంది. వత్వా, మణినగర్ స్టేషన్ల సమీపంలో రైలు గేదెల మందను ఢీకొట్టింది.