నిషత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్ నగర్‌లో గురువారం సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని చూడగా, ఇనుప పెట్టెలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం బయటపడింది. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని మహారాష్ట్రలోని గోండియాకు చెందిన అష్రాఫీ అలియాస్ సియా అనే యువతిగా గుర్తించారు. ఆమె వయసు, పేరుపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి.
పోలీసుల విచారణలో ఆటో డ్రైవర్ అయిన సమీర్ ఖాన్‌తో అష్రాఫీకి ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడినట్లు తేలింది. కొన్ని నెలల క్రితం ఆమె భోపాల్ వచ్చి సమీర్‌తో కలిసి ఉంటోంది. అయితే, అప్పటికే పెళ్లయిన సమీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో పాటు, డబ్బుల కోసం గొడవ పడుతోందని పోలీసులు తెలిపారు. ఈ వివాదాలే హత్యకు దారితీశాయి.
ఫిబ్రవరి 7 లేదా 8న సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన తల్లి, సోదరుడు, సోదరి సహాయంతో మృతదేహాన్ని ఇనుప పెట్టెలో ఉంచి, ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సమీర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
