CM Yogi: మంత్రులు, ప్రభుత్వ అధికారులకు యోగి ఝలక్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాత్ మాంచి దూకుడుమీదున్నారు.

  • Written By:
  • Updated On - April 14, 2022 / 11:54 AM IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాత్ మాంచి దూకుడుమీదున్నారు. వరుసగా రెండోసారి సీఎం అవ్వడంతో తన స్పీడును మరింత పెంచారు. ఈసారి మంత్రులతోపాటు ప్రభుత్వ అధికారులకూ ఝలక్ ఇచ్చారు. అధికారిక పర్యటనలకు వెళ్లే సమయంలో మంత్రులు కాని, అధికారులు కాని ప్రైవేటు హోటళ్లలో బస చేయవద్దంటూ ఆదేశించారు. దీంతో ఆఫీసర్స్ ఖంగుతిన్నారు. మంత్రులైనా, అధికారులైనా సరే అందరికీ ఇవే ఆదేశాలు వర్తిస్తాయన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆస్తులను సక్రమంగా వినియోగించుకోవడంతోపాటు.. అదనపు ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని యోగి భావిస్తున్నట్టుంది. దీంతోపాటు మంత్రులు ఎవరూ తమ బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దని తేల్చి చెప్పేశారు. దీనివల్ల అవినీతి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది.

యోగీ ఆదిత్యనాథ్ తొలిదశలోనే దూకుడుగా ఉన్నా.. రెండో దఫాలో మాత్రం తన స్టైలేంటో చూపిస్తున్నారు. లంచ్ పేరు చెప్పి చాలామంది గంటల తరబడి బయటకు వెళ్లివస్తుంటారు. అలాంటివి ఇక కుదరవు. ఎవరైనా సరే లంచ్ ని 30 నిమిషాల్లో పూర్తి చేసుకుని రావాల్సిందే. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని యోగీ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు ఆఫీసులకు లేటుగా వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదని యోగి తేల్చేశారు. ఒకవేళ లేటుగా వస్తే.. వాళ్లను ఆఫీసుల్లోకి అనుమతించరు. అలాగే ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా సరే.. మూడు రోజులకు మించి ఏ ఫైల్ కూడా పెండింగులో ఉండకూడదని డెడ్ లైన్ పెట్టారు. సిటిజన్ ఛార్టర్ ను కూడా అమలుచేయాలన్నారు. యోగీ చెప్పిన ఈ పనులన్నీ చెప్పినట్టుగా జరిగితే.. ఉత్తరప్రదేశ్ లో పరిపాలన మొత్తం మారే అవకాశం ఉంది.