UCC Bill Passed : ఉమ్మడి పౌరస్మృతి (UCC) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ ఆమోదం కోసం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మంగళవారం ఈ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్ ధామీ సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వాటితోపాటు సహ జీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని విపక్షాలు సూచించినా.. అధికార పార్టీ మాత్రం తన పంతం నెగ్గించుకుంది. ఒకసారి గవర్నర్ ఆమోదం పొందితే అది చట్టంగా(UCC Bill Passed) మారనుంది.
We’re now on WhatsApp. Click to Join
సీఎం పుష్కర్‌సింగ్ ధామీ ఏమన్నారో తెలుసా..
బిల్లు ఆమోదం పొందిన అనంతరం సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉత్తరాఖండ్ చరిత్రలో ఇదొక మరిచిపోలేని రోజు. యూసీసీ అమలుకు దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. అలాంటి ఈ బిల్లును తొలుత ఉత్తరాఖండ్ తీసుకొచ్చింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ బిల్లు ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా తీసుకొచ్చింది కాదు. దీనివల్ల ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. వివాహం, విడాకులు వంటి విషయాల్లో మహిళలపై ఉన్న వివక్షను ఈ బిల్లు తొలగిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read : Religious Tips: శని అనుగ్రహం కావాలంటే రావి చెట్టుకి ఎప్పుడు, ఎలా పూజ చేయాలో మీకు తెలుసా?
ఇతర రాష్ట్రాలూ రెడీ..
భవిష్యత్‌లో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈతరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్ ఇప్పటికే ప్రకటించింది.వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనలను అమల్లోకి తేవడమే యూసీసీ ప్రత్యేకత. పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచే గోవాలో ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉంది.
ఈ బిల్లులోని కీలక అంశాలివీ..
- పెళ్లికి కనీస వయసును మహిళలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు చేశారు.
- పెళ్లిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు.
- భార్యా భర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే సమాన కారణాల మీదే విడాకులు ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లులో చేర్చారు.
- మొదటి భార్య బతికి ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. అంటే బహు భార్యత్వాన్ని నిషేధించారు.
- మగవాళ్ల లాగే మహిళలకు కూడా వారసత్వంలో సమాన హక్కులు ఉంటాయని ఈ బిల్లులో పొందుపర్చారు.
- సహ జీవనం చేస్తున్న వారు తప్పనిసరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు.
- యూనిఫాం సివిల్ కోడ్ నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపును ఇచ్చారు. వారికి ప్రస్తుత చట్టాలే అమలవుతాయని పేర్కొన్నారు.