MQ 9B : ఇండియాకు 31 ‘ఎంక్యూ-9బీ’ డ్రోన్లు .. ఎలా పనిచేస్తాయో తెలుసా ?

MQ 9B :అవి అలాంటి ఇలాంటి డ్రోన్లు కాదు. ఆయుధాలను కూడా తమతో తీసుకెళ్లగలవు.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 07:14 AM IST

MQ 9B :అవి అలాంటి ఇలాంటి డ్రోన్లు కాదు. ఆయుధాలను కూడా తమతో తీసుకెళ్లగలవు. ఓ వైపు డ్రోన్లలా పనిచేస్తూనే.. మరోవైపు బాంబుల వర్షం కూడా కురిపించగలవు. గ్రౌండ్ నుంచి ఆర్మీ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ యుద్ధ విమానంలా వైమానిక దాడులను  చేయగలవు. ఈ ప్రత్యేకతలన్నీ ‘ఎంక్యూ-9బీ’ (MQ-9B) రకం సాయుధ డ్రోన్లకు సంబంధించినవి. ఈ మోడల్‌కు చెందిన 31 ‘ఎంక్యూ-9బీ’ (MQ-9B) డ్రోన్లను  భారత్‌కు విక్రయించేందుకు అమెరికా పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.33 వేల కోట్ల ప్రతిపాదిత ఒప్పందానికి అగ్రరాజ్యం ఆమోద ముద్ర వేసింది. గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్ల ఒప్పందాన్ని ప్రకటించారు.

రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో..

‘‘రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎంక్యూ-9బీ డ్రోన్లు, సంబంధిత పరికరాలను భారత్‌కు విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది’’ అని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.  ‘‘ఎంక్యూ-9బీ డ్రోన్ల విక్రయం అనేది అమెరికా- భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియాలో మా ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపర్చడానికి సాయం చేస్తుంది’’ అని అమెరికా ఏజెన్సీ తెలిపింది. భారత్‌కు అగ్రరాజ్యం విక్రయించనున్న 31  ఎంక్యూ-9బీ డ్రోన్లలో  15 ‘సీగార్డియన్ రకం డ్రోన్లు’ ఉంటాయి. వీటిని నౌకాదళానికి కేటాయిస్తారు. మిగిలిన 16 ‘స్కైగార్డియన్‌ రకం డ్రోన్ల’ను  ఆర్మీ, వాయుసేనకు ఎనిమిది చొప్పున అప్పగిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

అమెరికాకే చుక్కలు చూపించిన సూసైడ్ డ్రోన్!

ఇటీవల(జనవరి 28న) జోర్డాన్‌ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం టవర్‌ 22పై మిలిటెంట్‌ గ్రూప్‌ జరిపిన డ్రోన్‌ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండే అమెరికా డ్రోన్ దాడిని అడ్డుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాపు చేసిన‌ అమెరికా సైనిక అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. మిలిటెంట్‌ దళాలు డ్రోన్‌ దాడులు చేసిన సమయంలో అమెరికాకు సంబంధించిన ఒక డ్రోన్‌ ఆర్మీ పోస్ట్‌కు వస్తుందని సైనిక శిబిరం భావించింది. తక్కువ ఎత్తులో సైనిక స్థావరం వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను అ‍ప్పటికే షెడ్యూల్‌ చేసిన తమ డ్రోన్‌గా భావించించారు సైనిక అధికారులు. తమ స్థావరం వైపు వస్తున్న డ్రోన్‌ తమదే అనుకొని పొరపాటు పడ్డారు. దానివల్లే మిలిటెంట్ల డ్రోన్‌ దాడిని తాము అడ్డుకోలేకపోయామని సైనిక అధికారులు పేర్కొన్నారు. మిలిటెంట్లు ప్రయోగించిన సూసైడ్ డ్రోన్‌ సైనిక శిబిరంపై పడినట్లు పేర్కొంది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా.. 40 మంది సైనికులు  గాయపడ్డారు. ఇక్కడ సుమారు 350 మంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు.

Also Read :Pakistan Election: పాకిస్థాన్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి: అమెరికా