Urjit Patel : భారత రిజర్వ్ బ్యాంక్(RBI) మాజీ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆయన్ని ప్రముఖ బహుళపక్ష ఆర్థిక సంస్థ అయిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా భారత ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు. ఇందుకు సంబంధించి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు మంత్రిత్వశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
IMFలో కీలక భాద్యత
IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదా అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ పదవిలో ఉన్న వ్యక్తి సంస్థ యొక్క రోజువారీ పాలన, ఆర్థిక నిర్ణయాలు, గ్లోబల్ ఆర్థిక విధానాలపై కీలక పాత్ర పోషిస్తారు. మొత్తం 25 మంది డైరెక్టర్లు ఈ బోర్డులో ఉంటారు. ఈ డైరెక్టర్లను సభ్యదేశాలు లేదా వాటి గుంపులు ఎన్నుకుంటాయి. IMF మేనేజింగ్ డైరెక్టర్ ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశం తరపున IMFలో పటేల్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. భారత్‌కు తోడు శ్రీలంక, బాంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ లాంటి దక్షిణాసియా దేశాలను కూడా ఈ డైరెక్టరేట్ ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్ప ప్రాతినిధ్యం పొందినట్లు ఈ నియామకం సూచిస్తుంది.
ఉర్జిత్ పటేల్..అర్థిక రంగంలో అనుభవాల వరస
డాక్టర్ ఉర్జిత్ పటేల్‌కు దీర్ఘకాలిక ఆర్థిక అనుభవం ఉంది. ఆయన 2016 సెప్టెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు భారత రిజర్వ్ బ్యాంక్ 24వ గవర్నర్‌గా సేవలందించారు. తన పదవీకాలం ముగిసేందుకు ముందే వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థకు కీలక మలుపులుగా నిలిచాయి. అంతకు ముందు ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు. అలాగే, గతంలో IMFలోనే ఆర్థికవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, 2022 నుండి 2024 వరకు చైనా మద్దతుతో నడుస్తున్న ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(AIIB)లో వైస్ ప్రెసిడెంట్ హోదాలో కూడా సేవలందించారు. అలాగే, పటేల్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాంక్ డైరెక్టర్‌గా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇనిస్టిట్యూట్ సలహా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఈ పదవులు ఆయనకు గ్లోబల్ ఆర్థిక రంగంలో విశిష్టమైన స్థానాన్ని కలిగించాయి.
విదేశాంగాలలో భారత ప్రతిష్టకు మద్దతు
ఒక భారతీయుడిగా ఉర్జిత్ పటేల్ ఈ స్థాయిలో ఎంపిక కావడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇది భారత్ ఆర్థిక రంగ నైపుణ్యానికి, నూతన ఆర్థిక దృష్టికోణాలకు ప్రపంచ గుర్తింపుగా నిలుస్తోంది. ఆయన అనుభవం IMFలో భారత్‌తో పాటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధికి దోహదం చేయనుంది.
మరోసారి జాతీయగౌరవం
ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో భారతీయుల పాత్ర పెరుగుతోంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు, WTO వంటి సంస్థల్లోనూ భారతీయులకు కీలక పదవులు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ నియామకం మరొక మైలురాయిగా నిలుస్తోంది.