UPSC Aspirant Dies: ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన చల్లారకముందే మరో విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడగా, తాజాగా ఆమె వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె తన బాధను వ్యక్తం చేసింది. విద్యార్థి రాజేంద్ర నగర్‌లోని పీజీలో ఉంటూ యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది.
మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరుతూ ఆత్మహత్యకు పాల్పడింది. “నన్ను క్షమించండి, ఆత్మహత్య అనేది ఏ సమస్యకైనా పరిష్కారం కాదు కానీ నాకు మనశ్శాంతి కావాలి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ సూసైడ్ లేఖలో పేర్కొంది.
యూపీఎస్సీ పరీక్షల్లో రిగ్గింగ్‌ను ఆపాలని అంజలి సూసైడ్ నోట్‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు పరీక్ష కోసం చాలా కష్టపడి సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో వారి మనోబలం దెబ్బతింటుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని కోరింది. మేం ఉంటున్న చోట పీజీ, హాస్టల్ యజమానులు విద్యార్థులను దోచుకుంటున్నారని అంజలి తన సూసైడ్ నోట్‌లో రాసింది. పీజీ, హాస్టల్ అద్దెలపై నియంత్రణ ఉండాలి. విద్యార్థులందరికీ కావలసిన ఛార్జీలు చెల్లించడానికి తగినంత డబ్బు లేదు. ఎవరూ ఏడవాల్సిన అవసరం లేదని, అందరూ ఏదో ఒకరోజు చనిపోవాల్సిందేనని తన బాధను వెళ్లగక్కింది అంజలి.
Also Read: IPL 2025: చెన్నై గూటికి ఆర్సీబీ కెప్టెన్