Site icon HashtagU Telugu

UP Elections : మ‌హిళా ఓట‌ర్ల‌కు మోడీ గాలం

Modi Elections

Modi Elections

ఏ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ కేంద్రం నిధుల‌ను విచ్చ‌ల‌విడిగా ఇవ్వ‌డం ప‌రిపాటి అయింది. తాజాగా ఉత్త‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ 1000 కోట్ల రూపాయ‌ల‌ను మ‌హిళా ఖాతాల్లోకి కేంద్రం వేసింది. అక్క‌డి స్వ‌యం స‌హాయ సంఘాల పంట పండింది. మ‌హిళా ఓట‌ర్ల‌కు గాలం వేసేందుకు మోడీ నిధుల‌ను భారీగా బ‌దిలీ చేశాడు. దాదాపు 16 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందేలా 1000కోట్ల‌ను బ‌దిలీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. బాలికలకు సహాయం అందించే ముఖ్య మంత్రి కన్యా సుమంగళ పథకం ద్వారా లక్ష మందికి పైగా లబ్ధిదారులకు రూ. 20 లక్షల కోట్లను కూడా బదిలీ చేయ‌డం గ‌మ‌నార్హం.2 లక్షల మందికి పైగా మహిళలు హాజరైన మెగా ర్యాలీలో, 202 సప్లిమెంటరీ న్యూట్రిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశాడు. అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలకు అవసరమైన నైపుణ్యాలు, ప్రోత్సాహకాలు , వనరులను అందించడం ద్వారా సాధికారత కల్పించాలనే ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా ఈ ర్యాలీ జరిగింది.చాలా మంది లబ్దిదారులు కొంతకాలం క్రితం వరకు ఖాతాలు కూడా లేని బాలికలు ఉండేవార‌ని, కానీ ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ యొక్క శక్తిని మ‌హిళ‌లు క‌లిగి ఉన్నార‌ని మోడీ అన్నారు. అందుకే యూపీ కుమార్తెలు మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తార‌ని అన్నారు.పీఎం ఆవాస్‌ యోజన కింద యూపీలో 30 లక్షలకుపైగా ఇళ్లు నిర్మించబడ్డాయి. దాదాపు 25 లక్షల ఇళ్లు మహిళల పేరు మీద నమోదయ్యాయి. తరతరాలుగా ఇక్కడ మహిళలకు ఎలాంటి ఆస్తి లేదు. కానీ నేడు మొత్తం ఇల్లు వారి సొంతం. ఇదే నిజమైన మహిళా సాధికారత. మహిళల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం గురించి కూడా మోదీ ఈ ర్యాలీ నుద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 70% రుణాలు మహిళలకు పంపిణీ చేశామని ఓట్ల‌ను రాబ‌ట్టే విధంగా మోడీ ప్ర‌సంగించ‌డం గ‌మ‌నార్హం.