Site icon HashtagU Telugu

UP Assembly Election 2022: యూపీలో చివరి దశ పోలింగ్ ప్రారంభం..!

Up Assembly Elections 2022

Up Assembly Elections 2022

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో ఈరోజు యూపీ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమ‌యింది. యూపీలోని 9 జిల్లాల్లోని 54 స్థానాలకు సంబంధించి చివ‌రిద‌శ‌ పోలింగ్ ఈరోజు 7గంట‌ల‌కు ప్రారంభమైంది. ఇందుకోసం అక్క‌డి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది . ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌యిన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశతో ఉత్తర్ ప్రదేశ్ లోని 403 స్థానాలకు ఎన్నికలు పూర్తయినట్లే. చివరి దశ ఎన్నికలలో మొత్తం 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

పూర్వాంచల్‌లో తొమ్మిది జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆజంగఢ్, మీర్జాపూర్‌, మౌవ్‌, జాన్‌పూర్‌, ఘాజీపూర్‌, చన్‌దౌలి, భదోహి, సోన్‌భద్ర జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ నుండి ప్రధాని న‌రేంద్ర మోదీ అండ్ టీమ్, కాంగ్రెస్ నుండి ప్రియాంక గాంధీ, స‌మాజ్ వాద్ పార్టీ అధినేత‌ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు, రాజ్‌భర్, అనుప్రియా పటేల్, సంజయ్ నిషాద్‌ల‌కు ఈసారి గెలుపు అంత సుల‌భం కాద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇక ఈసారి ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. ఈ ఏడో దశ ఎన్నిక‌ల్లో యోగి సర్కార్ నుండి ఏడుగురు మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు.

వీరిలో అనిల్ రాజ్‌భర్(వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి), రవీంద్ర జైస్వాల్(రిజిస్ట్రేషన్ శాఖ సహాయ మంత్రి), నీలకంఠ తివారీ(సాంస్కృతిక శాఖ మంత్రి), గిరీష్ యాదవ్(పట్టణ ప్రణాళికా శాఖ మంత్రి ), రామశంకర్ సింగ్ పటేల్(ఇంధన శాఖ సహాయ మంత్రి), రాష్ట్ర మంత్రి సంజీవ్. గోండు, సంగీతా బల్వంత్(సహకార శాఖ సహాయ మంత్రి), ఈసారి ఎన్నిక‌ల పోటీలో ఉన్నారు. ఈసారి 2 కోట్లకు పైగా మంది ఓటర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం చివరి దశ ఎన్నికలు జరుగుతున్న 54 నియోజకవర్గాల్లో.. 2017 ఎన్నిక‌ల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు ద‌క్కించుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ 29 స్థానాల్లో గెలుపొంద‌గా, సమాజ్ వాదీ పార్టీ 11, అప్నాదళ్ 4, ఎబీఎస్పీ 3 సీట్లలో విజ‌యం సాధించాయి.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో కూడా ఈ విడతలోనే పోలింగ్ జరుగుతుండడంతో.. బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తర ప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో గత ఆరు విడతల్లో 349 సీట్లలో ఓటింగ్ ముగిసింది. మిగిలిన 54 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు ఓటింగ్ జ‌రుగుతుంది. దీంతో దేశంలోఐదు రాష్ట్రాలకు సంబంధించి రెండు నెలలుగా జరుగుతున్న పోలింగ్ పక్రియ ఈరోజుతో పూర్తి కానుంది. అంతేకాకుండా ఈరోజు రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఇక‌ మార్చి10న ఈ ఎన్నిక‌ల ఫలితాలు వెలువడనున్నాయి. మ‌రి దేశ‌వ్యాప్తంగా అంద‌రూ ఎంతో ఉత్కంఠంగానూ, ఎంతో ఆశ‌క్తిగానూ ఎదురు చూస్తున్న యూపీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుందో చూడాలి.