Jayaprada : తమిళనాడులో సినిమా థియేటర్ కార్మికుల ఈఎస్ఐ డబ్బులను ఎగ్గొట్టిన కేసును ఎదుర్కొంటున్న జయప్రదకు కొత్తగా మరో చిక్కు వచ్చిపడింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కేసులో నవంబర్ 17న తమ ఎదుట హాజరుకావాలని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఆమెపై గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వాస్తవానికి నవంబరు 8నే కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉండగా.. జయప్రద వెళ్లలేదు. దీంతో విచారణను నవంబరు 17కు కోర్టు వాయిదా వేసింది. గతంలోకి వెళితే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆమె నియోజకవర్గంలోని ఒక రోడ్డును ప్రారంభించారు. దీనిపై స్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ఆనాటి నుంచి రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో జయప్రదపై అప్పట్లో జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ కొనసాగుతుందని కోర్టు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని అన్నా రోడ్లో జయప్రద ఓ థియేటర్‌ను గతంలో నడిపించారు. రామ్‌కుమార్, రాజ్‌బాబు అనే ఇద్దరితో కలిసి ఈ థియేటర్‌ను నిర్వహించేవారు. థియేటర్లో పనిచేసే వర్కర్ల నుంచి ఈఎస్ఐ డబ్బులను జయప్రద వసూలు చేశారు. 1991 నుంచి 2002 మధ్య రూ.8.17 లక్షలు, 2002 నుంచి 2005 మధ్య రూ.లక్షా 58వేలు, 2003లో మరో రూ.లక్షా 58 వేలను కార్మికుల నుంచి సేకరించారు. కానీ ఈ డబ్బును కార్మికుల ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేయలేదు. దీంతో బాధిత కార్మికులంతా బీమా సంస్థను ఆశ్రయించారు. దీనికి సంబంధించి చెన్నై ఎగ్మోర్ కోర్టులో ఐదు కేసులు దాఖలయ్యాయి. ఈఎస్ఐ కంపెనీ తరఫున ఈ కేసులు నమోదయ్యాయి. విచారణ సందర్భంగా.. వర్కర్లకు ఇన్సూరెన్స్ డబ్బులు తిరిగి ఇస్తామని జయప్రద చెప్పుకొచ్చారు. డబ్బు తిరిగి చెల్లిస్తామనే జయప్రద ప్రతిపాదనను ఈఎస్ఐ తరఫు న్యాయవాది ఖండించారు. ఈ కేసులో ఈ సంవత్సరం ఆగస్టు 10న తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను జయప్రద సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. స్పందన తెలియజేయాలంటూ ఈఎస్ఐ కంపెనీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది. తిరిగి అక్టోబరు 18న విచారణ నిర్వహించిన మద్రాస్ హైకోర్టు.. జయప్రద విచారణకు రాకపోవడంతో 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు(Jayaprada) జారీ చేసింది.