దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం (summer) ముగిసినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. దీనికితోడు వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో 43 నుంచి 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లారీ డ్రైవర్ల (Lorry drivers) పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. లారీ డ్రైవర్ల క్యాబిన్‌లలో ఏసీ (AC)లు తప్పని చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్‌లలో ఏసీలు తప్పనిసరి చేసేలా ఫైలుపై నేను సంతకం చేశానని నితిన్ గడ్కరి చెప్పారు. అయితే, నితిన్ గడ్కరీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని అనుకున్నారట. కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదు.
లారీల్లో ఏసీ క్యాబిన్లు ఉండాలన్న డిమాండ్‌ను పరిశ్రమ వర్గాలు అప్పట్లో వ్యతిరేకించాయి. దీనివల్ల ఖర్చు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. పైగా ఏసీ క్యాబిన్లు ఉండటం వల్ల డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో అప్పట్లో ఈ నిర్ణయానికి వెనుకడుగు వేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తాజాగా 2025 నుంచి ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లు తప్పనిసరి నిబంధన అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సంబంధిత అధికారిక వర్గాలుకూడా త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలిపాయి.
కేంద్ర మంత్రి తాజా నిర్ణయంతో స్టాక్ మార్కెట్‌లలో ఏసీ కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. లారీ డ్రైవర్ క్యాబిన్‌లలో ఏసీలు తప్పనిసరి చేయడం వల్ల భవిష్యత్తులో ఏసీ తయారీ కంపెనీలకు మరిన్ని ఆర్డర్లు దక్కే అవకాశం ఉంది. దీంతో ఆయా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఏంబర్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు ఎనిమిది శాతం, బ్లూస్టార్ నాలుగు శాతం, జాన్సన్ హిటాచీ షేర్లు నాలుగు శాతం మేర లాభపడినట్లు స్టాక్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Heat wave: దేశంలో వడగాలుల తీవ్రతపై అప్రమత్తమైన కేంద్రం.. పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు