Site icon HashtagU Telugu

Gas Princess:అయ్యో! ఈ గ్యాస్ రాణి ఉండుంటే.. ఉక్రెయిన్ ఈ ఖర్మే పట్టేది కాదుగా!

Gas Princess

Gas Princess

దేశానికి పరిపాలించడానికి దమ్ముండాలి. ఇతర దేశాలతో దౌత్యాన్ని నెరపడానికి తెలివుండాలి. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను తీసుకోవడానికి చాణక్యం ఉండాలి. వాటిని అమలు చేయడానికి తెగువ కనబరచాలి. దురదృష్టం కొద్దీ ఉక్రెయిన్ కు ఇప్పుడు ఇలాంటి లక్షణాలున్న నాయకుడు లేకుండా పోయారు. ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్ స్కీ దూకుడుగానే ఉన్నా.. ఆయన ఉక్రెయిన్ ను రక్షించే పరిస్థితిలో లేరు. అందుకే ఉక్రెయిన్ వాసులు.. ఇప్పుడు ఒకే ఒక పేరును తలుచుకుంటున్నారు. ఆ పేరు యులియా టిమోషెంకో. ఉక్రెయిన్ కు తొలి మహిళా ప్రధాని.

యులియా టిమోషెంకో ఇప్పుడు అధికారంలో ఉండుంటే.. ఉక్రెయిన్ కథ వేరుగా ఉండేది. ఈవిడకు మరో పేరు కూడా ఉంది. గ్యాస్ క్వీన్.. ఇంకొందరు గ్యాస్ ప్రిన్సెస్ అని కూడా పిలుస్తారు. ఆమె తన పదవిలో ఉన్నన్నాళ్లూ చాలా ధైర్యంగా పరిపాలించేవారు. అదే సమయంలో పశ్చిమ దేశాలతో సత్సంబంధాలను నెరుపుతూ.. ఉక్రెయిన్ మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం వచ్చేలా చాలా కృషి చేశారు.

రష్యా పేరెత్తితేనే మండిపడే యులియా టిమోషెంకో ఆ దేశంతో చాలా చాకచక్యంగా వ్యవహరించేవారు. అందుకే యులియా పరిపాలనాకాలంలో రష్యా కాస్త జాగ్రత్తగానే ఉండేది. ఇప్పటిలా యుద్ధం పేరు చెప్పి భయపెట్టడం కాని, యుద్ధం చేయడం కాని జరగలేదు. అంతలా బోర్డర్ కు అవతలే రష్యాను ఉంచేది యులియా. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ వాసులకు ఆమె మరోసారి ఫేవరెట్ లీడర్ గా మారిపోయారు.

యులియా చదువుకున్నది ఎకనామిక్స్-సైబర్ నెటిక్స్ లో డిగ్రీ. తరువాత లెనిన్ కంపెనీలో పనిచేశారు. కొద్దికాలం తరువాత ఉక్రెయిన్ లోనే యునైటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ అనే సంస్థను ఏర్పాటుచేసి.. పరిశ్రమలకు గ్యాస్ ను అందించేవారు. దానిలో విపరీతమైన లాభాలు వచ్చేవి. అదే ఆమెను ఉక్రెయిన్ లో ధనవంతురాలిగా చేసింది. ఈ పరిశ్రమను స్థాపించిన తరువాత ఆమె పేరు కాస్తా.. గ్యాస్ క్వీన్ గా మారిపోయింది. ఉక్రేనియన్లు ముద్దుగా అలా పిలుచుకునేవారు.