Site icon HashtagU Telugu

Russia Ukraine War: పుతిన్ దండ‌యాత్ర‌.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి

Ukrain Russai88

Ukrain Russai88

అగ్ర‌రాజ్యం అమెరికా హెచ్చరికలను లెక్కచేయలేదు, నాటో దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. దేనికైనా సిద్ధమంటూ తెగించి మ‌రీ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ దండ‌యాత్ర ప్రారంభించ‌డంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం నుంచి ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాలు లక్ష్యంగా ర‌ష్యా మిస్సైల్స్‌ దూసుకెళ్తున్నాయి. మ‌రోవైపు ఉక్రెయిన్ పై ర‌ష్యా సైబ‌ర్ వార్‌ను కూడా స్టార్ట్ చేసింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఉక్రెయిన్‌పై సైబర్ యుద్ధం చేసేందుకు రష్యా రెండు నెలల క్రితమే వైప‌ర్ మాల్‌వేర్ అనే హ్యాకింగ్ టూల్స్‌ను సిద్ధం చేసిందని తెలుస్తోంది. వైపర్ మాల్‌వేర్ ఎలా పనిచేస్తుందంటే, ఒక్క‌సారి సిస్ట‌మ్ పై దాడి చేసిందంటే, అందులో ఉన్న డేటా మొత్తం పొయిన‌ట్టే, తొల‌గించిన డేటాను రిక‌వ‌రీ చేయ‌డం సాధ్యం కాదు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లో ఎయిర్‌స్ట్రిప్‌ టెక్నాలజీ వ్యవస్థని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించుకుంది. ఉక్రెయిన్‌ పార్లమెంట్‌, బ్యాంకులు, ఐటీపై సైబర్‌ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌ సర్వర్లపైనా రష్యా సైబర్‌ ఎటాక్ చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఉక్రెయిన్‌లో ఎయిర్‌పోర్టులను స్వాధీనం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్‌ పోర్టుసిటీపై కూడా బాంబుల వర్షం కురిపించింది. సైనికస్థావరాలు, కీలకవ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామంటోంది రష్యా. ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకునే ఆలోచన లేదంటూనే దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రష్యాదాడిలో ఉక్రెయిన్‌ సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాదాడిలో 300మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించిందిఎంతోమంది ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. ర‌ష్యా సైనిక బ‌ల‌గాలు విరుచుకు ప‌డుతున్నా, తనకున్న ఆయుధసంపత్తితోనే ఉక్రెయిన్‌ ప్రతిఘటనకు దిగింది.

ఈ క్ర‌మంలో రష్యాకి బెలారస్‌ తోడవ్వటంతో ముప్పేటదాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌ నాటో దేశాలు కలిసొస్తాయనే నమ్మకంతో ఉంది. అందుకే రష్యా ఆయుధసంపత్తిని ఎదుర్కునే శక్తి లేకపోయినా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఐదు రష్యా యుద్ధ విమానాలతో పాటు హెలికాప్టర్‌ని కూల్చినట్లు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. రష్యాపై యుద్ధం ఆలోచన లేదంటూనే అమెరికా సమర సన్నాహాల్లో ఉంది. బ్రిటన్‌నుంచి అమెరికా బాంబర్లు గాల్లోకి ఎగిరాయి. నాటో దళాలకు సహకరిస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. ఇక రష్యాపై ప్రతిదాడికి నాటోదళాలు సిద్ధమవుతుండటంతో యుద్ధం యూరప్‌కే పరిమితమయ్యేలా కనిపించడంలేదు. రష్యా దూకుడు ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉంది.

ఉక్రెయిన్‌పై తమ దాడిని అడ్డుకునేందుకు ఎవరూ సాహసించొద్దని, ముఖ్యంగా నాటో బ‌ల‌గాలు ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తిస్తే, క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని రష్యా అధ్య‌క్ష‌లు పుతిన్ ప్ర‌పంచ దేశాల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై దాడిని పూర్తిగా సమర్ధించుకున్నపుతిన్‌.. ఇప్పటికైనా ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోతే మంచివదని లేకుంటే ఉక్రెయిన్‌లో ర‌ష్యా దండ‌యాత్ర సాగుతోంద‌ని పుతిన్ హెచ్చరించారు. మ‌రోవైపు నాటో దేశాలు ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం జీ సెవెన్‌ దేశాల అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. ఏది ఏమైనా ఉక్రెయిన్ మీద ప‌డి రష్యా సైనిక బ‌ల‌గాలు దండ‌యాత్ర సాగిస్తుండ‌డంతో, ఉక్రెయిన్ ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.