బీజేపీకి ద్రోహం చేసినోళ్ల‌ను వ‌ద‌లం: కేంద్ర మంత్రి అమిత్ షా

ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేశారని, ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా సోమ‌వారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో అన్నారు

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 04:15 PM IST

ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేశారని, ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా సోమ‌వారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో అన్నారు. “మేము రాజకీయాల్లో దేన్నైనా సహించగలము కానీ ద్రోహాన్ని కాదు” అని షా చెప్పినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ చీలికకు, తదనంతర పరిణామాలకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కారణమని షా ఆరోపించారని తెలుస్తోంది. అతని “దురాశ కార‌ణంగా ఒక వర్గం అతనికి వ్యతిరేకంగా మారింద‌ని అన్నారు. ఏక్నాథ్ షిండే తిరుగుబాటులో బిజెపి పాత్ర లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం షా చేశారు. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటే థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కారణమని అన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే బిజెపికి ద్రోహం చేయడమే కాకుండా “సిద్ధాంతానికి ద్రోహం చేసాడు. మహారాష్ట్ర ప్రజల ఆదేశాన్ని కూడా అవమానించాడు” అని షా ఆగ్ర‌హించారు. ఆయన అధికార దురాశ వల్లే ఈరోజు ఆయన పార్టీ కుంచించుకుపోయిందని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవిని ఎన్నడూ వాగ్దానం చేయలేదని అమిత్ షా మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. బహిరంగంగా రాజకీయాలు చేసే వ్యక్తులమ‌ని, మూసిన గదులలో కాదు అంటూ షా నొక్కిచెప్పారు.

రాజకీయాల్లో మోసం చేసేవారిని శిక్షించాల్సిందేనని షా అన్నారు. ముంబైలో రాబోయే పౌర ఎన్నికల కోసం “మిషన్ 150” ద్వారా దీనిని సాధించవచ్చని ఆయన అన్నారు. ముంబై కార్పొరేషన్ దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థ, దీన్ని బీజేపీ కైవ‌సం చేసుకోవాల‌ని చాలా కాలంగా ప్ర‌య‌త్నం చేస్తోంది.