Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ఉత్తరాఖండ్‌లో 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈవిషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తన తీర్మానం ప్రకారం యూసీసీని అమలు చేయడానికి హోంవర్క్‌ను పూర్తి చేసిందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు యూసీసీ వినియోగానికి సంబంధించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రంలో యూసీసీ అమల్లోకి వచ్చేస్తుందని సీఎం తెలిపారు. దీంతో దేశంలోనే తొలిసారిగా యూసీసీ(Uniform Civil Code)ని అమల్లోకి తెచ్చిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందని పుష్కర్‌సింగ్ ధామి చెప్పారు. ఇవాళ (బుధవారం) డెహ్రాడూన్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఉత్తరాఖండ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ బోర్డ్ సమావేశంలో సీఎం ధామి మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.
Also Read :SBI Jobs : ఎస్‌బీఐలో 13,735 జాబ్స్.. తెలంగాణలో 342, ఏపీలో 50 ఖాళీలు
- ఉత్తరాఖండ్ సీఎం ధామి 2022 సంవత్సరం మార్చిలో యూసీసీపై ప్రకటన చేశారు.
- 2022 మార్చిలో ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. యూనిఫాం సివిల్ కోడ్ రూపకల్పన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ఆ సమావేశంలోనే సీఎం ధామి ప్రకటించారు.
- రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
- ఆ కమిటీ రూపొందించిన యూసీసీ ముసాయిదా బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. ఆ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. దీనిపై ఈ ఏడాది మార్చి 12న అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
- యూనిఫాం సివిల్ కోడ్ అమలులో భాగంగా సామాన్య ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్‌ను కూడా రెడీ చేశారు. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, అప్పీలు తదితర అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారు.
- మంగళవారం రోజు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. యూసీసీ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత రాజ్యాంగానికి సమానత్వ భావన గుండెకాయ లాంటిది. అన్ని అంశాల్లో అందరికీ సమానత్వం ఉండాలి. అందుకే యూసీసీని అమలు చేయాలి. జవహర్ లాల్ నెహ్రూ హయాంలో ముస్లిం పర్సనల్ లాను తెచ్చినందు వల్లే యూసీసీ అమలును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది’’ అని ఆయన విమర్శలు గుప్పించారు.