Hindi In US Schools : అమెరికా గడ్డపై మన జాతీయ భాష హిందీకి అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో మొదటిసారిగా సిలికాన్ వ్యాలీలోని రెండు ప్రభుత్వ పాఠశాలలలో ప్రపంచ భాషగా హిందీ సబ్జెక్టును చేర్చారు. ఈ స్కూళ్లలో హిందీ అనే ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంటుంది. భారత సంతతికి చెందిన విద్యార్థులు, ఆసక్తి కలిగిన ఇతర విద్యార్థులు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని ఫ్రీమాంట్ ఏరియాలోని భారతీయులు స్వాగతించారు. తమ పిల్లలకు పాఠశాలల్లో హిందీ నేర్చుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఫ్రీమాంట్ అనేది కాలిఫోర్నియాలో అత్యధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు నివసించే ప్రాంతం. వారిని దృష్టిలో ఉంచుకొని రెండు గవర్నమెంటు స్కూళ్లలో హిందీని ప్రపంచ భాషగా(Hindi In US Schools) చేర్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యే 2024-2025 విద్యా సంవత్సరం నుంచి సిలికాన్ వ్యాలీలోని హార్నర్ మిడిల్ స్కూల్, ఇర్వింగ్‌టన్ హైస్కూల్‌కు చెందిన పాఠ్యాంశాల్లో హిందీని ప్రపంచ భాషగా అమలుచేస్తారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ అమలు కోసం ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ (FUSD) బోర్డు చేసిన తీర్మానం జనవరి 17న 4-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ (FUSD) బోర్డు ప్రెసిడెంట్ యాజింగ్ జాంగ్, సభ్యులు వివేక్ ప్రసాద్, షారన్ కోకో, లారీ స్వీనీ ఉన్నారు. హార్నర్ మిడిల్ స్కూల్, ఇర్వింగ్టన్ హైస్కూల్‌లలో 65 శాతం మంది భారత సంతతి విద్యార్థులే ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం 29 ఎలిమెంటరీ స్కూల్ క్యాంపస్‌లు, ఐదు మిడిల్ స్కూల్ క్యాంపస్‌లు, ఐదు హైస్కూల్ క్యాంపస్‌లు ఉన్నాయి. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు FUSD బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.