Site icon HashtagU Telugu

DOSTI: ఏడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఇండియా, పాకిస్థాన్ స్నేహితులు

ప్రేమలోనైనా,స్నేహంలోనైనా విడిపోతే ఉండే బాధ అనుభవించేవారికే తెలుస్తుంది. విడిపోయి బాధపడేవారు కొన్ని దశాబ్దాల తర్వాత కలిస్తే ఉండే ఆనందం కూడా అనుభవించే వారికే తెలుస్తుంది.

రాజమౌళి సినిమాల్లో తప్పా సాధ్యపడని ఒక అద్భుతసన్నివేశం నిజంగా జరిగింది. 1947లో దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు సరిగ్గా
74 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పలు కారణాల వల్ల దూరమైన ఈ ఇద్దరు స్నేహితులు తిరిగి 90 ఏళ్ల వయస్సుల్లో మళ్లీ కలుసుకొని తమ చిన్ననాటి ముచ్చట్లను, ఎడబాటును గుర్తుచేసుకున్నారు. అసలు ఊహించని వారి కలయికని నమ్మలేక ఆనందంలో మునిగిపోయారు.

ప్రస్తుత భారత్ లోని పంజాబ్ కు చెందిన 94 ఏండ్ల సర్దార్ గోపాల్ సింగ్, ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్న నరోవాల్ సిటీకి చెందిన 91 ఏండ్ల మొహమ్మద్ బషీర్ తమ చిన్నతనంలో స్నేహితులుగా ఉండేవారు. దేశ విభజనకు ముందు వారిద్దరూ గురునానక్ గురుద్వారాకి వెళ్లేవారు. అక్కడ కలిసి భోజనం చేసేవాళ్లు,టీ తాగేవాళ్లు. కాలక్రమేణా వాళ్లిద్దరూ మంచి స్నేహితులయ్యారు.

1947లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ దేశంగా ఏర్పడింది. దేశ విభజన వల్ల ఈ ఇద్దరు స్నేహితులు విడిపోయారు. కలుద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. అయితే
కరోనా వల్ల సంవత్సరంన్నర కాలంగా మూతబడి ఇటీవలే తెరవబడ్డ కర్తార్​పుర్​ కారిడార్ ఆ ఇద్దరు స్నేహితులను కలిపింది.

 https://twitter.com/aarifshaah/status/1462680250223972353

కర్తార్‌పుర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ సందర్శనలో అనుకోకుండా గోపాల్ సింగ్, బషీర్‌లు కలుసుకొని కాసేపు మాటలురాని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఏడున్నర దశాబ్దాల తర్వాత అనుకోకుండా కలవడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాము మళ్ళీ కలుసుకోవడానికి పరోక్షంగా కారణమైన ఇండియన్, పాక్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఈ మిత్రుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వీరిది అపూర్వమైన కలయిక అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 https://twitter.com/SinghLions/status/1462837304502878209

Exit mobile version